స్వయం ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి 16వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు మూడు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో జత చేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు సెంటర్ ఇన్‌చార్జి ఎస్.విజయ్‌కుమార్ (94415 65895)ను సంప్రదించాలని సూచించారు.
మంత్రివర్గంలో
చోటు కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ధర్నాచౌక్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిరోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ విద్యార్థుల పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. తండాలను ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి ఒక్కొక్క పంచాయతీ అభివృద్దికి రూ.5 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం చేసే పోరాటాలకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కర్యాదర్వి రవీందర్‌నాయక్, ప్రతాప్, సంజీవ్‌నాయక్, లక్ష్మన్‌నాయక్, కిషన్‌పవర్, రెహమాన్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
క్రమబద్ధీకరించే వరకు పోరాడుతాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్‌శాఖలో ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే వరకు పోరాడుతామని విద్యుత్ ఆర్టిజన్స్ కమిటీ జేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. స్థానిక విద్యుత్‌భవన్ ముందు నిర్వహిస్తున్న రిలే దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్టిజన్స్ విద్యార్హతలను బట్టి అందరికీ కన్వర్షన్ అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోవిద్యుత్ ఆర్టిజన్స్ కమిటీ జేఏసీ జిల్లా కన్వీనర్ రాములు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలేష్, నాయకులు మహేష్‌యాదవ్, ప్రభాకర్, శ్రీహరి, వెంకటేశ్, హనుమతు, తదితరులు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బీఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడి)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అయితే 50 శాతం మార్కులు వచ్చి ఉండాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్‌లో ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఈనెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. 25వ తేదీన శనివారం జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment