అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భూత్పూర్ మండలం కప్పెటలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఇళ్లు, నాలుగేళ్ల నుంచి పింఛన్లు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేల చొప్పున అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. కాగా, తమకు అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం లేదని కప్పెటకు చెందిన వడ్డె నర్సమ్మ, కుర్వ జంగమ్మ, బోయ రంగమ్మ, దాచర్ల శాంతి మంత్రి దృష్టికి తీసుకురాగా.. వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్ విజయేందిరను మంత్రి ఆదేశించారు. అలాగే నడవలేని స్థితిలో ఉన్న జ్ఞానేశ్వర్‌కు ట్రైసైకిల్ అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment