ప్రైవేటు ఆస్పత్రుల్లో జనాన్ని పీడిస్తే సహించం
దేవరకద్ర/భూత్పూర్: ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. దేవరకద్రలో రూ.35 కోట్లతో నిర్మించే వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను దోపిడీ చేసే ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలకు ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఆస్పత్రుల యాజమాన్యంపై కఠిన చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. వైద్యరంగంలో వినూత్న పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై చోటుచేసుకునే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణం వైద్యసేవలు అందించేందుకు ప్రతి 30 కిలో మీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కోసెంటర్ ఏర్పాటుకు రూ.5 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు చెప్పారు. దేవరకద్ర, మక్తల్‌లో ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కిడ్నీ రోగులకు అందుబాటులో ఉండేలా ప్రతి 30 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నచింతకుంటలోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేవరకద్రలో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. వైద్యసేవల కోసం 8 వేల మంది డాక్టర్లు, నర్సులను నియమించినట్లు చెప్పారు.
● ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కాగా, కౌకుంట్లలో నిర్మించే ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు అంబులెన్స్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు. పేరూర్, చిన్నచింతకుంట పీహెచ్‌సీలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లుగా మార్చాలన్నారు. కార్యక్రమాల్లో టీవీవీపీ కమిషనర్ డా.అజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్ర ప్రతాప్, ఎస్పీ జానకి, ఏఎస్పీ రాములు, డీసీహెచ్‌ఎస్ చంద్రకళ, డీఎంహెచ్‌ఓ కృష్ణ, మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, కిషన్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కతలయ్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్యరంగంలో వినూత్న పథకాలు
ప్రతి 30 కి.మీ.కు
ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment