పరిశుభ్రతే మహాభాగ్యం
● ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ● దోమల నివారణతోనే విషజ్వరాల వ్యాప్తి అంతం ● నేడు డెంగీ నివారణ దినోత్సవం
మంచిర్యాలటౌన్/కౌటాల: ‘ఆరోగ్యమే మహా భాగ్యం’అన్న నానుడి నిజం కావాలంటే... ముందుగా మన చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు మన ఇంటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వ్యక్తిగత శుభ్రతతో పాటు జీవించే ఇల్లు, ఆవరణ, చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిదని, అప్పుడే డెంగీ దోమలు వృద్ధి చెందకుండా, ప్రాణాలు తీసే జ్వరాల బారిన పడకుండా రక్షించబడతారు. డెంగీ పేరు వింటేనే జనానికి దడపుడుతోంది. వర్షాకాలం మొదలైందంటే సీజనల్ వ్యాధులతో పాటు, డెంగీ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బోండాలు, వాహనాల పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, నీటి తొట్టెలు, పూలకుండీలలో నీరు నిల్వ ఉంటే అందులో ఎడిస్ ఈజిప్ట్ అనే డెంగీ దోమ వృద్ధి చెందుతుంది. పగటి పూట కుట్టే ఈ దోమ వల్లనే డెంగీ జ్వరం వస్తుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ఇది ఒకరి నుంచి మరొకరికి ఏడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. జ్వరం, హేమరేజ్, షాక్ సిండ్రోమ్ అనే మూడు దశల్లో డెంగీ తీవ్రత ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్‌ల ద్వారా మాత్రమే డెంగీ లక్షణాలను గుర్తిస్తారు. పూర్తిగా నిర్దారణ చేసేందుకు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో, టీహబ్‌లో ఎలిజా టెస్టు చేసేందుకు అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం డెంగీ కిట్‌లతో పరీక్షించి రక్తకణాలు తగ్గుతున్నాయంటూ, డెంగీ వైద్యం పేరిట లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకోవడం కంటే, నిరంతరం ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
గతేడాది ఎక్కడ డెంగీ కేసులు నమోదయ్యాయో అక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ముల్కల్ల, దేవాపూర్, మంచిర్యాల మున్సిపాలిటీల్లో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని పీహెచ్‌సీలలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు డెంగీ వ్యాధి గురించి వివరిస్తున్నాం. డెంగీ నిర్ధారణకు సంబంధించిన రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్స్‌లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్‌లకు ఇచ్చాం. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, టీహబ్‌లలో డెంగీ పూర్తి నిర్ధారణ కోసం ఎలిజా టెస్టు చేస్తున్నాం.
– డాక్టర్ అనిత, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు, గ్రామస్థాయిలో ఆశ కార్యకర్తల సహకారంతో బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ బృందాలతో యాంటీలార్వా ఆపరేషన్స్, డెంగీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో డెంగీని సాధ్యమైనంత వరకు తగ్గించాం. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా
మలేరియా అధికారి, ఆసిఫాబాద్
జిల్లాలో చేసిన డెంగీ పరీక్షలు,
నమోదైన కేసులు
సంవత్సరం పరీక్షలు డెంగీ కేసులు
2020 522 32
2021 2046 118
2022 2502 116
2023 1350 74
2024 20 1
డెంగీ లక్షణాలు
ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టిన తరువాత నాలుగు నుంచి పదిరోజుల మధ్య డెంగీ లక్షణాలు బయటపడతాయి.
తీవ్రమైన జ్వరంతో ఈ వ్యాధి మొదలవుతుంది.
కళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది.
ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి.
వాంతులు, వికారం, రక్తంతో కూడిన మల విసర్జన ప్రధాన లక్షణం
ఈ లక్షణాలు నాలుగు నుంచి ఆరు రోజులు కొనసాగుతాయి.
డెంగీ లక్షణాలు ఉంటే బీపీ పడిపోతుంది. రక్తకణాలు తగ్గుతాయి. ఇవన్నీ ఐదు నుంచి ఏడు రోజుల మధ్య జరుగుతాయి.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే దీని నిర్ధారణ పరీక్ష అందుబాటులో ఉంది.
చికిత్స
వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధులకు పూర్తి చికిత్స లేదు.
లక్షణాలను బట్టి వైద్యులతో ఉపశమన చర్యలు చేపట్టాలి.
డెంగీ వ్యాధికి వైద్యం ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.
రక్త నమూనాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయాలి.
దోమల నివారణ ఇలా..
దోమ తెరలు వాడటం, ఇంటికి కిటీకీలకు, తలుపులకు జాలీలను బిగించడం.
ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం.
నీటి తొట్టెలను వారం రోజులకోసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం.
తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
కూలర్లు, ఫ్లవర్‌వాజ్, పూలకుండీలలో నీటిని తరచూ మార్చాలి.
నీటి నిల్వలో దోమలు వృద్ధి చెందకుండా టిమిసాస్ మందు స్ప్రే చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment