యువకుడి దారుణహత్య
● ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా? ● ఇద్దరు బైక్‌పై వచ్చి హత్య చేసి పరార్ ● అడ్డొచ్చిన హార్వెస్టర్ డ్రైవర్‌పై దాడికి యత్నం ● వివరాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్‌టీం
కాళేశ్వరం: ఓ యువకుడిని ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల చంద్రక్క, అంకయ్య దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్(23) నాలుగు రోజుల నుంచి తన హార్వెస్టర్‌తో చండ్రుపల్లిలో వరి పొలాల కోతలు చేపడుతున్నాడు. బుధవారం సాయంత్రం ఇద్దరు దుండగులు పల్సర్‌బైక్‌పై పై వచ్చి అతడితో గొడవ పడ్డారు. కత్తులతో పొడిచి హత్య చేశారు. హార్వెస్టర్ డ్రైవర్ కమ్మగోని ప్రదీప్‌గౌడ్ పరుగున వచ్చిన ఆపే ప్రయత్నం చేయగా అతడిపైనా దాడికి యత్నించారు. దీంతో అతను భయపడి దుండగులు వచ్చిన బైక్ తాళాలు తీసుకుని గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులు వస్తారని భయపడిన దుండగులు పొలాల మీదుగా పరారయ్యారు.
కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు
కాగా, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సదరు యువకుడి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. మహదేవపూర్ సీఐ రామచంద్రారావు, మహదేవపూర్, కాళేశ్వరం ఎస్సైలు పవన్‌కుమార్, చక్రపాణి వివరాలు సేకరిస్తున్నారు. అన్నారం పరిధిలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దుండగుల పల్సర్ బైక్, తమ వెంట తీసుకొచ్చిన తెల్ల కల్లు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వద్ద హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా, దుండగులు కొమ్మెర గ్రామంలో కూడా మృతుడి ఇంటి వద్ద, చండ్రుపల్లి పరిసరాల్లో నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రారావు తెలిపారు. మృతదేహాన్ని మహదేవపూర్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment