బియ్యానికే పరిమితం! | Sakshi
Sakshi News home page

బియ్యానికే పరిమితం!

Published Thu, Apr 18 2024 10:30 AM

రేషన్‌ షాపులో బియ్యం ఇస్తున్న దృశ్యం (ఫైల్‌ )  - Sakshi

ఎక్కువ ధరకు బయట కొంటున్నాం

కంట్రోల్‌ షాపుల్లో చక్కెర కిలో ధర రూ.13.50 ఉండేది. ప్రస్తుతం బయట రూ. 40 కిలోకు కొంటున్నాం. గతంలో కందిపప్పు, ఫాం ఆయిల్‌, గోదుమలు, కిరోసిన్‌, చింతపండు, కారం ఇచ్చే వారు. కాని ఇప్పుడు అవి కనిపించడం లేదు. ధరలు ఎక్కువైనా బయట కొంటున్నాం. ఇప్పటికై నా జొన్నలు, గోదుమలు, నూనెలు సరఫరా చేయాలి.

– శ్రీశైలం, ముద్దాపురం

పాపన్నపేట(మెదక్‌): నిరుపేదలకు చౌక ధరలకే నిత్యావసర వస్తువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రాను రాను నీరు గారి పోతుంది. రేషన్‌ షా పులను సూపర్‌ మార్కెట్లుగా మారుస్తామన్న వాగ్దానాలు నీటి మూటలవుతున్నాయి. కేవలం ఉచిత బియ్యం పంపిణీకే రేషన్‌ షాపులు పరిమితం అవుతున్నాయి. చక్కెర గోధుమలు కాన రావడం లేదు. పప్పులు, కిరోసిన్‌ మాటే మరిచారు. ఒకప్పుడు పంపిణీ చేసిన ఆరురకాల నిత్యావసరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ధరలు మండుతున్నా పేదలు కిరాణ దుకాణాలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 520 రేషన్‌షాపులు 2,13,863 రేషన్‌కార్డులు, 6,85,901 లబ్ధిదారులు ఉన్నారు. నెలకు 36,264 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. గతంలో నిరుపేదలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను రేషన్‌ షాపుల ద్వారా అందించే వారు. గతంలో చక్కెర, మంచి నూనె, కిరోసిన్‌, గోధుమలు సరఫరా చేసేవారు. మధ్యలో కంది పప్పు, చింత పండు, కారం,ఉప్పు లాంటి నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు.

చక్కెర ధరకు రెక్కలు

రేషన్‌షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు పంపిణీ చేయాల్సి ఉంది. చౌకధరల దుకాణంలో కిలో చక్కెర రూ.13.50, అదే బహిరంగ మార్కెట్‌లో రూ.40 ఉంది. అంటే దాదాపు మూడు రెట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అలాగే గోధుమలు కిలో రూ.7 ఉండగా, బయట మార్కెట్‌లో రూ.30 నుంచి 35 వరకు పలుకుతుంది. అంత్యోదయ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు ఇవ్వాలి. కాని కేవలం కొన్ని పట్టణాల్లో మాత్రమే గోధుమలు, చక్కెర సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో మాత్రం బియ్యం తప్ప ఇతర వస్తువులు కనిపించడం లేదు. గతంలో పండగల పూట చక్కెర డబుల్‌ కోటా ఇచ్చే వారు. కానీ ఇప్పుడు చక్కెర జాడే కనిపించడం లేదు. సమతులిత ఆహారంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, పప్పులు, నూనెలు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తే నిరుపేదలకు మేలు చేకూతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. చౌక ధరల దుకాణాలను సూపర్‌ మార్కెట్లుగా మారుస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. కాని ప్రస్తుతం ఉన్నవే మూత బడే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పాపన్నపేట ఎమ్మార్వో లక్ష్మణ్‌బాబును వివరణ కోరగా గోదాంల నుంచి చక్కెర రావడం లేదని తెలిపారు. బియ్యం తప్ప ఇతర వస్తువులు సరఫరా కావడం లేదన్నారు.

● రేషన్‌ దుకాణాల్లో కానరాని చక్కెర, గోధుమలు

● మరిచిన పప్పులు, కిరోసిన్‌

రేషన్‌ కార్డులు : 2,13,863 లబ్ధిదారులు : 6,85,901

1/1

Advertisement
Advertisement