ఈ టీఏ మాకొద్దు సారూ..
● పనిచేయని వారికి ఉపాధి
డబ్బులు వేశారు
● సామాజిక తనిఖీలో వెల్మకన్నగ్రామస్తుల ఆగ్రహం
కౌడిపల్లి(నర్సాపూర్): టీఏ మా గ్రామానికి ఎప్పు డూ రాలేదు.. పనిచేయని వారికి కూలీ డబ్బులు వస్తున్నాయి.. చేసిన వారికి సరిగా రావడం లేదని వెల్మకన్న గ్రామ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించగా.. అదనపు డీఆర్‌డీఓ రంగాచార్యులు, డీవీఓ (జిల్లా విజిలెన్స్ అధికారి) శ్రీహరి, ఉపాధి హామీ స్టేట్ టీం మానిటరింగ్ అధికారులు అశోక్, దత్తు హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కూలీ పనులు చేయని వారికి ఎఫ్‌ఏ ముత్తయ్య, టీఏ హీర్య డబ్బులు వేశారని డీఆర్‌పీ బాలకృష్ణ వెల్లడించారు. ఇష్టం వచ్చిన వారికి మస్టర్‌లో అటెండెన్స్ వేస్తూ డబ్బులు కాజేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు పనిచేయకున్న చేసినట్లు హాజరు వేశారని, గ్రామసభలో సైతం నాయకులు తాము పనిచేయలేదని హాజరు ఎందుకువేశారో తెలియదని చెప్పారని పేర్కొన్నారు. అదనపు డీఆర్‌డీఓ రంగాచార్యులు, డీవీఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో గతేడాది రూ. 8.53 కోట్ల విలువైన పనులు చేశారని, పనుల్లో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేయడం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ అరుణ, హెచ్‌ఎం మేనేజర్ రాజేందర్, ఎస్‌ఆర్‌పీ జీవన్, ఎంపీఓ కలీముల్ల, ఏపీఓ పుణ్యదాస్, ఈసీ ప్రేంకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment