మృత్యువులోనూ వీడని బంధం
ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. కలిసిమెలిసి పెరిగారు. చదువుతో పాటు కొంతకాలం ఉద్యోగం చేశారు. ప్రతి పనీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. మృతులిద్దరికీ చిన్న కూతుర్లు ఉన్నారు. చేతికొచ్చిన కుమారులు విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నర్సాపూర్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్ (25) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. నర్సాపూర్‌లోని ఓ పౌల్ట్రీకి సంబంధించిన సంస్థలో సూపర్‌వైజర్లుగా చేరారు. ఇటీవలే దుర్గాప్రసాద్ ఉద్యోగాన్ని వదిలి గ్రామంలో కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో నాగరాజు పౌల్ట్రీ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం కొంపల్లిలో పని ఉండడంతో మిత్రుడు దుర్గాప్రసాద్‌తో కలిసి బైక్‌పై శుక్రవారం ఉదయం బయలుదేరారు. పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారి చౌరస్తా వైపు వెళ్తుండగా.. స్థానిక ఎస్‌బీఐ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ మృత్యురూపంలో దూసుకొచ్చింది. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన నాగరాజును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. లారీని డ్రైవర్ ఆపకుండా వెళ్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగరాజు చిన్నతనంలోనే తండ్రి కిష్టయ్య మృతిచెందగా.. తల్లి సుగుణ కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించి కూతురు, కుమారుడి పెళ్లి చేసింది. నాగరాజుకు భార్య మేఘమాలతో పాటు ఏడాది వయసున్న కూతురు ఉంది. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. అదే గ్రామానికి చెందిన కుమ్మరి భిక్షపతి, మంజుల దంపతులు కులవృత్తితో పాటు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తూ ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కొడుకు దుర్గాప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సారికతో పాటు సుమారు ఆరునెలల కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జాన్‌రెడ్డి పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు భారీగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరుస్నేహితుల దుర్మరణం
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
అల్లీపూర్‌లో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment