బడిబయట పిల్లల గుర్తింపు
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని చెర్లపల్లి గ్రామంలో మంగళవారం బడిబయట ఉన్న బడీడు పిల్లలను గుర్తించేందుకు సీఆర్‌పీ రాజు, ఉపాధ్యాయురాలు సునీత, వెల్దుర్తి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌లు పర్యటించారు. బడిబయట ఉన్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి ఎర్రొళ్ల సునీతను కేజీబీవీ, శివచరణ్‌ను వెల్దుర్తి ఉన్నత పాఠశాలలో చేర్పించారు. బడీడు పిల్లలను బడికి పంపేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
యూనిఫాం పంపిణీ
వెల్దుర్తి(తూప్రాన్): అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ వరలక్ష్మి అన్నారు. మంగళవారం వెల్దుర్తి అంగన్‌వాడీ కేంద్రం–1లో ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫామ్‌లను ఆమె పిల్లలకు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ నాగమణి, ఆయా శ్రావణి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ నేతల
ఆందోళన
శివ్వంపేట(నర్సాపూర్): ప్రజా పాలన బ్యానర్‌పై ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు ఫొటోలు పెట్టకపోవడంపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆందోళన చేశారు. మండల పరిధిలోని పిల్లుట్లలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ఎమ్మెల్యే, ఎంపీల ఫొటోలు పెట్టకపోవడం వారిని అవమానించడమేనని బీజేపీ మండలాధ్యక్షుడు రవి, బీఆర్‌ఎస్ నాయకులు చింత స్వామి, పోచగౌడ్ ఆరోపించారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన బ్యానర్ తొలగించి నిరసన వ్యక్తం చేశారు.
అన్ని రంగాల్లో రాణించాలి
మనోహరాబాద్(తూప్రాన్): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా పద్మశాలీ అధ్యక్షుడు జయరాములు అన్నారు. మంగళవారం పలు గ్రామాల పద్మశాలీ సంఘం అధ్యక్షులను ఎన్నుకున్నారు. మనోహరాబాద్, దండుపల్లి, కూచారం, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, రామాయపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల అధ్యక్షుడిగా జంజీరాల శ్రీనివాస్‌ను, ఉపాధ్య క్షుడిగా శ్రీధర్, కోశాధికారిగా అజయ్‌కుమార్, యూత్‌విభాగం అధ్యక్షుడిగా గడ్డం శ్రవణ్‌కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి రాజు, పద్మశాలీ సభ్యులు పాల్గొన్నారు.
టీచర్ల దాతృత్వం..
పాపన్నపేట(మెదక్): పదో తరగతి స్పెషల్ క్లాసుల్లో ఆకలితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఇద్దరు టీచర్లు ముందుకొచ్చారు. మండలంలోని చీకోడ్ –లింగాయపల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి, చీకోడ్‌కు చెందిన అధ్యాపకుడు భూపాల్‌రెడ్డి మంగళవారం రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు తమ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో వక్త నవీన్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆక్రమణకు శ్మశాన వాటిక
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తి గ్రామశివారులోని హిందూ శ్మశాన వాటిక స్థలం రోజురోజుకూ కబ్జాకు గురవుతుంతోంది. దీంతో భవిష్యత్‌లో దాని ఆనవాళ్లు లేకుండా పోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం పేరిట కొందరు భూస్వాములు శ్మశానవాటికలో స్థలాన్ని జేసీబీల సహాయంతో చదునుచేయించి ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా అందులోని కొంతభాగాన్ని జేసీబీ సహాయంతో మడులుగా తయారు చేయడాన్ని గ్రామ యువకులు ఖండించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కృష్ణకు గ్రామ యువకులు మంగళవారం వినతిపత్రం సమర్పించి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment