సాక్షి, ముంబై: అయిదేళ్ల డేటింగ్ తరువాత బాలీవుడ్ బ్యూటిఫుల్ లవర్స్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. బీటౌన్‌లో ఏ నోట విన్నా ఇపుడు లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్, క్యూటీ ఆలియా భట్ వెడ్డింగ్ బెల్స్ గురించే. మరి కపూర్ , భట్ ఫ్యామిలీస్‌లో పెళ్లి అంటే ఆ మాత్రం సందడి ఉంటుంది కదా. మరి వీళ్ల వెడ్డింగ్ డెస్టినేషన్ ఎక్కడ? ఎలాంటి డిజైనర్ నగలు, దుస్తులు ధరించబోతున్నారు. హనీమూన్ ఎక్కడ? అండ్ ఫైనల్లీ రిసెప్షన్ ఎక్కడ? ఇవన్నీ క్రేజీ అండ్ హాట్ టాపిక్స్‌గా నిలుస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమపక్షులు ఆలియా, రణబీర్ మూడుముళ్ల బంధంతో ఒకటికానున్నారు. ఇందులో భాగంగా నేడు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మెహందీ ఫంక్షన్‌తో వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.మరోవైపు అలియా, రణబీర్ పెళ్లి వేడుకలలో భాగంగా రణబీర్ తల్లి నీతూ కపూర్, వధువు తండ్రి మహేష్ భట్, రీమా జైన్ , ఇతర కుటుంబ సభ్యులు పాలి హిల్ హౌస్‌లో గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సుభాష్ ఘాయ్ తన చిన్ననాటి స్నేహితుడు దివంగత నటుడు రిషీకపూర్, నీతూ పెళ్లిలో తాను డ్రమ్స్ వాయించానని ఇందుకు రాజ్‌కపూర్ చాలా సంతోషించారంటూ గుర్తు చేసుకున్నారు. మామయ్యగా తన ఆశీస్సులు రణ్‌బీర్, అలియాకి ఎపుడూ ఉంటాయని ఘాయ్ తెలిపారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇతర సెలబ్రిటీలు కూడా కాబోయే దంపతులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం విశేషంగా నిలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా టీం తరపున కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ రణబీర్ సన్నిహిత మిత్రుడు అయాన్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. సరికొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్న రణబీర్, అలియా కోసం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. దీనిపై అలియా హార్ట్ ఎమోజీతో స్పందించింది. కాగా రణబీర్, అలియా జంటగా నటించిన అయాన్ ముఖర్జీ నిర్మించిన బ్రహ్మాస్త్ర మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
అటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తొందరగా పిల్లల్ని కను అంటూ రణబీర్‌కి సలహా ఇచ్చారట. అలాగే ఆలియా, రణబీర్ పెళ్లి కబురు విన్న ప్రముఖ డాన్సర్ ఫరాఖాన్ అలియా భట్ వీడియో కాల్ చేసి మరీ అభినందనల్లో ముంచెత్తారు. 'నన్ను మిస్ అవుతున్నావా?' ఫరా అలియాను అని ప్రశ్నించడం, అలియా 'చాలా' అని సమాధానం ఇవ్వడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment