ఆరు చిత్రాలు.. 750 కోట్లు | Sanjay Dutt Upcoming Movies updates 2020 | Sakshi
Sakshi News home page

ఆరు చిత్రాలు.. 750 కోట్లు

Published Fri, Aug 21 2020 2:10 AM | Last Updated on Fri, Aug 21 2020 2:19 AM

Sanjay Dutt Upcoming Movies updates 2020 - Sakshi

‘మీరు క్షేమంగా తిరిగి రావాలి.. వచ్చేస్తారు’... సంజయ్‌ దత్‌ని ఉద్దేశించి ఆయన అభిమానులు అంటున్న మాటలివి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇటీవల సంజయ్‌ దత్‌ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహిస్తే ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ అని తేలింది. సంజయ్‌ ఆరోగ్యం ఏమవుతుందో అని ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలయింది.

ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్న సినిమాల సంగతేంటి? అనే చర్చ కూడా ఇండస్ట్రీ సర్కిల్‌లో మొదలయింది.ఈ అనారోగ్యానికి సంబంధించిన చికిత్స కోసం అమెరికా వెళతారని, సింగపూర్‌ ప్రయాణం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ముందస్తు చికిత్స కోసం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు సంజయ్‌ దత్‌. ఆయన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. సంజయ్‌ దత్‌ కోలుకుని వచ్చేవరకూ ఆ చిత్రాల షూటింగ్స్‌ ప్లాన్‌ చేయడానికి లేదు. ఇక ఆ సినిమాల వివరాలు చూద్దాం.

రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా యశ్‌ రాజ్‌ సంస్థ ఓ భారీ పీరియాడికల్‌ చిత్రం నిర్మిస్తోంది. ‘షంషేర్‌’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌తో తలపడనున్నారు రణ్‌బీర్‌ కపూర్‌. సంజయ్‌ది పవర్‌ఫుల్‌ విలన్‌ రోల్‌. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ సినిమా చిత్రీకరణలోనే సంజయ్‌ దత్‌ అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 శాతం చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం.

అజయ్‌ దేవగన్‌ హీరోగా 1971 ఇండో–పాక్‌ యుద్ధం సమయంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు సంజయ్‌ దత్‌. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఈ సినిమాను హాట్‌ స్టార్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సంజయ్‌ దత్‌ చేస్తున్నవాటిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కేజీఎఫ్‌ 2’.

తొలి భాగం సాధించిన భారీ విజయంతో రెండో భాగం పై అంచనాలు ఏర్పడ్డాయి. సెకండ్‌ పార్ట్‌లో విలన్‌గా నటిస్తున్నారు సంజయ్‌. ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా జరిగింది. ‘‘చికిత్స వీలైనంత త్వరగా పూర్తి చేసి షూటింగ్‌లో పాల్గొంటానని సంజయ్‌ పేర్కొన్నారు’’ అని ఈ చిత్రబృందం తెలిపింది. ఇటీవలే ఈ చిత్రంలో సంజయ్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా ‘పృథ్వీరాజ్‌’’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరో.

ఈ సినిమాలోనూ సంజయ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ  కూడా 50 శాతం మిగిలి ఉంది. అలానే  ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘తోర్భాజ్‌’ కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్‌ పడింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలని ఈ చిత్రాల నిర్మాతలు అనుకుంటున్నారు. ఈలోపు సంజయ్‌ దత్‌ ఇలా అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఆయన త్వరగా కోలుకొని చిత్రీకరణలో పాల్గొనాలని కోరుకుందాం. గెట్‌ వెల్‌ సూన్‌ సంజూ!

మహేష్‌ భట్‌ దర్శకుడిగా కమ్‌ బ్యాక్‌ ఇస్తున్న చిత్రం ‘సడక్‌ 2’. 1991లో సంజయ్‌ దత్‌తో మహేష్‌ భట్‌ చేసిన ‘సడక్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ‘హాట్‌ స్టార్‌’లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ కూడా పూర్తి చేశారట.

750 కోట్ల బిజినెస్‌
సంజయ్‌ దత్‌ చేతిలో ఉన్న సినిమాల్లో ‘షంషేర్, పృథ్వీ రాజ్, కేజీఏఫ్‌ 2’ భారీ బడ్జెట్‌ చిత్రాలే. మిగతావి మీడియమ్‌ రేంజ్‌ చిత్రాలు. ఆయన కమిట్‌ అయన ఆరు చిత్రాల బడ్జెట్‌ సుమారు 750 కోట్లు అని సమాచారం.  

సంజయ్‌ చేతిలో ఉన్న సినిమాలు
1. సడక్‌ 2 (పూర్తయింది)
2. భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా.
3. కేజీఎఫ్‌ 2
4. షంషేర్‌
5. పృథ్వీరాజ్‌
6. తొర్భాజ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement