
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో తన పార్టీ రూపు రేఖలపై ఆయన దృష్టి పెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ పోరులో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా..? పొత్తుకు వెళ్తారా..? అనేది తేలాల్సి ఉంది. పాదయాత్రతో తన ఎన్నికల ప్రస్థానం ప్రారంభించాలని విజయ్ ఉన్నారని తెలుస్తోంది.
పార్టీకి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయడమే కాకుండా 2 లక్షల మందికి పదవులను కట్టబెట్టేందుకు కార్యచరణలో ఉన్నారు. ఇప్పటికే తమ పార్టీకి జెండాతో పాటు ఎన్నికల గుర్తును కేటాయించేందుకు ఎన్నికల సంఘాన్ని విజయ్ ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఉద్దేశాలు, సిద్దాంతాలు ప్రకటించాలని విజయ్‌లో వ్యూహం ఉందట.
పార్టీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో చెబుతున్న ప్రకారం.. సెప్టెంబరు- నవంబరు నెలల్లో ఆయన ప్రజల్లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. తిరుచ్చి వేదికగా రాజకీయంగా తొలి అడుగు వేయాలని విజయ్ ఉన్నారట. ఈమేరకు పార్టీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గత కొద్దిరోజులుగా విజయ్ మాటతీరు చూస్తుంటే డీఎంకే, బీజేపీలకు వ్యతిరేకిగా ఉన్నారనే భావన కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నాడీఎంకేతో ఆయన కలిసి పోటీ చేయవచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే, విజయ్‌నే సీఎం అభ్యర్థిగా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.