రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయి బంబానియా సందర్శించారు. ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్.. ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా.. రామప్ప ఆలయ శిల్పాకళాసంపద బాగుందని కేంద్ర సహాయ మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డు వద్ద అభయాంజనేయస్వామి 35 ఫీట్ల విగ్రహ ప్రతిష్ఠాపన పనులు వేగంగా సాగుతున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. గ్రామ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు విగ్రహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్‌రావు, గడదాసు సునీల్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, గండెపల్లి నర్సయ్య, మాదరి రాంబాబు, కాళ్ల రామకృష్ణ, దేపక శ్రీరామ్, రాంనర్సయ్య పాల్గొన్నారు.
బొలెరో వాహనం ఢీ..
పశువుల మృతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఢీకొని నాలుగు పశువులు మృతి చెందాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని నర్సింగాపూర్ నుంచి ఏటూరునాగారం వైపు హైవే నుంచి కామారం వెళ్లేదారి సమీపంలో మేతకు వెళ్లి వస్తున్న పశువులను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెబోయిన ధనలక్ష్మి, రేగుల స్వరూప, పాయిరాల నర్సయ్య, పిట్టల అజయ్‌లకు చెందిన నలుగురి పశువులు మృతి చెందగా మరో పశువు తీవ్రంగా గాయపడింది. పశువులను తొలుకుని వస్తున్న భరత్ కూడా వాహనం తగిలి గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
నాటువైద్యంతో ప్రాణాపాయం
ములుగు రూరల్: ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నాటువైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని నిమ్స్ వైద్య బృందం సభ్యుడు గంగాధర్ అన్నారు. ఈ మేరకు గురువారం మండల పరిధిలోని జంగాపల్లిలో మూడు రోజులుగా రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న వైద్య శిబిరాన్ని బృందం వైద్యులు పరిశీలించారు. ఈ శిబిరంలో వైద్య సిబ్బంది అందించిన వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఒళ్లు నొప్పుల పేరుతో ప్రతిరోజూ పెయిన్ కిల్లర్ మాత్రలు వాడకూడదన్నారు. మూడు రోజులుగా గ్రామంలో వైద్య శిబిరంలో జ్వర పీడితుల నుంచి సేకరించిన రక్త నమూనాల రికార్డును పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీ హబ్ కేంద్రాన్ని, రేడియాలజీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం సభ్యులు స్వర్ణలత, సిరాజ్, విష్ణు, హరికృష్ణ, జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, పీహెచ్‌సీ వైద్యుడు ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment