దేవాలయాల్లో భక్తుల సందడి
మంగపేట/వెంకటాపురం(ఎం): జిల్లాలోని హేమాచల క్షేత్రంతో పాటు రామప్ప దేవాలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తజన సందడి నెలకొంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముక్కాముల రాజశేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు ఉదయం 10నుంచి 12గంటల వరకు నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు నిర్వహించారు. అదే విధంగా వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం గయానా దేశానికి చెందిన 15మంది జర్నలిస్టులు సందర్శించారు. హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న గయానా దేశస్తులు శిక్షణలో భాగంగా ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తొలుత రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ చరిత్ర గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా భారతదేశ చరిత్ర గొప్పదని, సంస్కృతి సంప్రాదాయాలు తమకు ఎంతగానో నచ్చాయని వెల్లడించారు. ఆనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు వసంతలక్ష్మి, రవి, సతీష్‌లు ఉన్నారు.
బొగతలో
పర్యాటకులు
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకులు సందడి నెలకొంది. బొగతకు వచ్చిన పర్యాటకులు జలపాతం నుంచి జాలువారుతున్న జలధారలను వీక్షించి ప్రకృతి రమణీయతకు ముగ్ధులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment