ఆధ్యాత్మిక.. అనుబంధాల
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
నాణ్యమైన భోజనం
అందించాలి
ములుగు రూరల్: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల కిచెన్ షెడ్, డైనింగ్ హాల్‌తో పాటు పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మెనూ వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలతను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
ముగ్గురు దొంగల అరెస్టు
ఏటూరునాగారం: బెల్ట్‌షాపులలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్సై సుబ్బారావు తెలిపారు. మండల కేంద్రంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని కాటాపురం ప్రాంతంలోని వీరపురం గ్రామానికి చెందిన చేల సందీప్, ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన వజ్జెటి అరవింద్, గంగిపాటి నరేష్‌లు దొంగతనాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
కాళేశ్వరాలయంలో
రామగుండం సీపీ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ శ్రీనివాస్ శనివారం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన వేదిక వద్ద ఆయనను అర్చకుడు రామకృష్ణశర్మ కండువాతో సన్మానించి తీర్ధప్రసాదం అందజేశారు. ఆయన వెంట ఎస్సై చక్రపాణి, పోలీసులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీకి చెందిన విద్యార్థిని గాజుల మౌనిక అండర్ –12 జావలీన్ త్రో విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో మౌనిక ప్రతిభ కనబర్చింది. దీంతో నిర్వాహాకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. డిసెంబర్ 1న మంచిర్యాల జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో మౌనిక పాల్గొననున్నట్లు ఎస్‌ఓ పేర్కొన్నారు. మౌనికను ఎస్‌ఓ సునీతతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
హన్మకొండ కల్చరల్ :
కార్తీక మాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల సందడి కనిపిస్తుంది. అందరూ భక్తిభావంతో పూజలు చేస్తూ సరదాగా ఆట, పాటలతో గడుపుతారు. ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కులాలు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వనభోజనాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్తీక మాసంలో వనభోజనాల ప్రత్యేకతలపై ఈ వారం ప్రత్యేక కథనం.
వనంతోనే ఆనందం..
కార్తీక మాసం వనభోజనం అంటే ఎక్కడపడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు. వనభోజనానికి ఆహ్లాదకరమైన ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వనభోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసి వంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుంచి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మేలు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తర్వాత విస్తరాకుల్లో గానీ అరిటాకుల్లో గానీ అందరూ కలిసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలిసి పనిచేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనిపిస్తుంది.
ఆరోగ్య రహస్యం..
ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. ముందు శ్రావణ, భాద్రపద మాసాలు వర్ష రుతువు కావడంతో ఆ నెలల్లో కురిసిన వర్షాలకు నేల మీద ఎన్నో మొక్కలు జీవం పోసుకుని కార్తీక మాసం వచ్చేసరికి చక్కగా పెరుగుతాయి. కార్తీక మాసంలో చీకటి పడిన తర్వాత కొంచెం చలి ప్రారంభమవుతుంది. కానీ, పగలు అటు ఎండ ఎక్కువగా లేకుండా, ఇటు మంచు పడకుండా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో వర్ష రహితంగా అందరూ కలిసి జరుపుకునే వన సమారాధనల వల్ల వ్యక్తులు, కుటుంబాల మధ్య సమైక్యత ఏర్పడుతుందన్నది నమ్మకం. ఆ విధంగా ఆధ్యాత్మికం, ఆరోగ్య శాస్త్రాల మేళవింపుగా మన పూర్వీకులు ఏర్పరచినవే వన సమారాధనలు (వనభోజనాలు).
ఆటలు.. పాటలు..
కార్తీక వనభోజనాల్లో తమ తమ కమ్యూనిటీలో మంచిచెడులను చర్చించుకుంటారు. అందరూ కలిసి ఐక్యతను చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెద్దలు, పిల్లలు వేర్వేరుగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని వల్ల రోజువారీ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆటలపోటీల్లో రాణించిన వారికి బహుమతులను అందజేయడం వల్ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఐక్యత చాటేందుకే వనభోజనం
కమ్యూనిటీ వాళ్లు ఎక్కడెక్కడో ఉంటారు. కార్తీక మాసంలో నిర్వహించుకునే వనభోజనాల కార్యక్రమం ఆధ్యాత్మికత సంతరించడమేకాకుండా మనలో ఐక్యత చాటుతుంది. వనం వల్ల మానసిక ప్రశాంతత, పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొంది, వృద్ధులకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.
– శామంతుల శ్రీనివాస్,
పోపా రాష్ట్ర అధ్యక్షుడు
సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని
మేలుకొల్పుతాయి
కార్తీక సమారాధనలు సర్వమానవ సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని మేలుకొల్పుతాయి. ధాత్రినారాయణస్వామిని (ఉసిరిక చెట్టు), లక్ష్మి స్వరూపమైన (తులసి చెట్టు)ను ప్రతిష్ఠించి పూజలు చేయాలి. అక్కడ కార్తీక వనభోజనాలు చేయడం శ్రేయస్కరం. వస్త్ర, సాలగ్రామ, దీపదానాలు చేయడం ఉత్తమం.
– ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి,
ధర్మప్రవచకులు
సరదాగా గడుపుతాం..
ఖిలా వరంగల్ ఏకశిల చిల్డ్ర న్స్ పార్కులో గౌడ కుల బంధువులతో కలిసి నేడు (ఆదివారం) వనభోజనం ఏర్పాటు చేశాం. అందరం ఒకేచోట కలుసుకునే అరుదైన వేదిక ఇది. గౌడల ఆరాధ్య దేవుళ్లను పూజించుకుంటాం. వనసమారాధన చేస్తాం. పిల్లలు, పెద్దలు కలిసి సరదాగా గడుపుతాం.
– డాక్టర్ చిర్ర రాజుగౌడ్,
గౌడ (గోపా) జిల్లా అధ్యక్షుడు
●
● హేమాచలక్షేత్రానికి భారీగా తరలివచ్చిన సందర్శకులు
● రామప్పలో గయానా దేశస్తుల పూజలు
న్యూస్‌రీల్
కార్తీక మాసంలో ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం
వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద
సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ
ఐక్యతను చాటేలా కార్యక్రమాలు.. ఆటపాటలతో వనమంతా సందడే
నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
వనభోజనాలు
నేడు వనభోజనాలకు సర్వం సిద్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కులాల వారీగా ప్రజలు వనభోజనాలకు సర్వం సిద్ధమయ్యారు. ఆలయాలు, పార్కులు, చుట్టుపక్కల ఉన్న పండ్ల తోటలు, విశాలమైన ప్రదేశాల్లో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా త్రికోట పరిసరాలు, వనవిజ్ఞాన కేంద్రం, ఏకశిల చిల్డ్రన్స్ పార్కు, వరంగల్ కోటి లింగాల దేవాలయం, ఖిలావరంగల్ వాకర్స్ మైదానంలో పద్మశాలీలు, గౌడ, మున్నూరుకాపు, ఆర్యవైశ్య, ఇతర కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఉసిరి, తులసి మొక్కలకు పూజలు
వనభోజనాల సందర్భంగా కొన్ని ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలను నిర్దేశించారు. వనభోజనం ఉసిరి చెట్టు ఉన్న చోట చేయాలి. ఉసిరి చెట్టును విష్ణుమూర్తికి ప్రతిరూపంగా పురాణాల్లో పేర్కొన్నారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈకార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసి మొక్కను ఉంచి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, లక్ష్మీనారాయణ ఆశీస్సులతో సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. అందుకే అనేక మంది ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మను తీసుకు వచ్చి ఒకచోట గుచ్చి దానికి పూజ చేసి అనంతరం అక్కడ సామూహికంగా వనభోజనం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment