ప్రశ్నించే వారికి సమాధానం ఇస్తాం..
ములుగు: ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని ప్రశ్నించేవారికి తగిన సమాధానం ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలలో భాగంగా ములుగులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్ ఎదుట పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కళాయాత్ర ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలుచేశామన్నారు. రైతులకు రూ.18లక్షల కోట్ల రుణమాఫీ చేశామని, మిగిలిన రైతులకు డిసెంబర్ కల్లా అందిస్తామని తెలిపారు. మహిళలకు రూ.2,500, రైతులకు ఏడాదికి రూ.7,500 రైతు భరోసా అందిస్తామన్నారు. రైతుల సన్నవడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. కొంతమంది ప్రభుత్వ ఫలాలను అందుకుంటూ ఆరోపణలు చేస్తున్నారని అలాంటి వారి వివరాలను గ్రామ పంచాయతీల ముందు ప్రదర్శించి తగిన సమాధానం ఇస్తామన్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రానికి వచ్చిన 50 కార్పొరేట్ కంపెనీల బస్సుయాత్రను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడోత్సవాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ శిరీష, తాడ్వాయి సీడీపీఓ మల్లీశ్వరీ, ఐసీఐసీఐ బీఎం శ్రీకాంత్, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్, నందెల్లా నిర్మాణ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మయూర్ పాల్గొన్నారు.
అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి
గోవిందరావుపేట: అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలని, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని మంత్రి సీతక్క అన్నారు. బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరతో కలిసి నిర్మాన్ సంస్థ నేతృత్వంలో జిల్లాకు వచ్చిన 50 కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల బృందం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక స్వచ్ఛంద సంస్థలు కేవలం నగరాల చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. నిజానికి ములుగు జిల్లా లాంటి మారుమూల ప్రాంతాలకు ఎంతో అవసరమన్నారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో మల్టీనేషనల్ కంపెనీలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వచ్చాయని తెలిపారు. నిర్మాన్ సంస్థ సీఈఓ మయూర్ మాట్లాడుతూ మంత్రి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు రావాలని ఆహ్వానం అందించారని తెలిపారు. దీనిలో భాగంగానే పలు సంస్థలు ఎల్‌బీ నగర్, మాన్యతండా, రాంనగర్ హబిటేషన్లలో పరిశీలించి యువతకు నైపుణ్యం, శిక్షణ తరగతులు అందించి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలలో కావాల్సిన సౌకర్యాలపై ప్రజలు అర్జీలు అందించారు. కార్యక్రమంలో నిర్మాన్ సంస్థ, ఇతర కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, తహసీల్దార్ సృజన్ కుమార్, ఎంపీడీఓ జవహర్ రెడ్డి, ఎంపీఓ శరత్, పంచాయతీ సెక్రటరీ స్వర్ణ పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment