చిన్న కాళేశ్వరానికి రూ.571 కోట్లు
కాటారం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద గోదావరిపై నిర్మించనున్న చిన్న కాళేశ్వరం(ముక్తీశ్వర) ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.571.57 కోట్లు మంజూరు చేయగా పరిపాలన అనుమతులు వచ్చినట్లు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్ట్ నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపుతోపాటు ప్రాజెక్ట్ డిజైన్‌లో స్వల్పమార్పులు చేస్తూ మంత్రులు, అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాటారం సబ్ డివిజన్ పరిధిలో 63 గ్రామాల్లోని 45 వేల ఎకరాలకు సాగు నీరందించడం, అర టీఎంసీ తాగునీటి సరఫరాకు వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించి కన్నెపల్లి వద్ద ఒకటో పంప్‌హౌస్ ద్వారా 4.2 టిఎంసీల నీరు దిగువన రెండో పంప్‌హౌస్‌కు సరఫరా అవుతుంది. మొదటి పంపు హౌస్ సెకెన్‌కు 600 క్యూబిక్ ఫీట్ల నీటిని ఎత్తిపోస్తుందని, అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు నీటి సరఫరా అవుతుంది. మిగిలిన నీరు కాటారంలోని రెండో పంప్‌హౌస్‌కు చేరి.. అక్కడి నుంచి గారెపల్లి, పోలారం, తాండ్ర, ఎల్లాపూర్, కొత్తపల్లి, గుమ్మాళ్లపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారంపేట, వీరాపూర్, గూడూర్ చెరువులకు నీరు చేరుతుందని సమావేశంలో వివరించారు.
రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి లక్ష్యంగా..
2007లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న ప్రాజెక్ట్ పనులు కొంత మేర పూర్తి కాగా.. కొన్ని కారణాలతో పనులు నిలిచిపోయాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెరపైకి తేవడంతో చిన్న కాళేశ్వరం మరుగునపడింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రాగా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వం నుంచి రూ.571.51 కోట్లు మంజూరు చేయించడంతో ప్రాజెక్ట్ పూర్తికావడానికి మార్గం సుగమమైంది. ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా శ్రీధర్‌బాబు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
ప్రాజెక్టులపై జరిగిన సమావేశంలో
మంత్రుల వెల్లడి
నెరవేరనున్న ప్రజల ఆకాంక్ష
Comments
Please login to add a commentAdd a comment