కొండపర్తిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గవర్నర్ దత్తత గ్రామమైన కొండపర్తిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు గురువారం అధికారులతో కలిసి కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గవర్నర్ జిల్లా పర్యటనకు వచ్చిన క్రమంలో మంత్రి సీతక్క కొండపర్తిని దత్తత తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించి దత్తత తీసుకున్నారన్నారు. గ్రామంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సోలార్ ఆర్గనైజింగ్ సిస్టం ద్వారా మసాలా మేకింగ్, టైలరింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్, అంగన్‌వాడీ భవనాలకు ప్రహరీలు, టాయిలెట్లు, వాటర్ సప్లై ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. తరగతి గదుల్లో డ్యూయల్ డెస్క్‌లు, డిజిటల్ క్లాస్‌రూంల ఏర్పాటుతో పాటు గ్రామంలో డ్రెయినేజీలు నిర్మించుటకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క చొరవతో గవర్నర్ కొండపర్తిని దత్తత తీసుకోగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, ఎలక్ట్రిసిటీ డీఈ నాగేశ్వర్‌రావు, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment