పత్తి దళారుల పాలు
వెంకటాపురం(ఎం) : వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి చేతికి వచ్చిన పంట దళారుల పాలైందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సాగులో ఉన్న భూమి రికార్డులో లేకపోవడంతో పండిన పత్తి పంటను మార్కెట్‌కు తరలించి అమ్ముకోలేక దళారులకు విక్రయిస్తే తూకంలో మోసం చేసి తమ కడుపుకొట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల నుంచి ఆత్మకూరుకు చెందిన కొంతమంది దళారులు రెండు ట్రాలీ ఆటోలలో వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి వచ్చి వీధుల్లో తిరుగుతూ పత్తిపంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో క్వింటా పత్తికి రూ.7,200లు పైన ఉండగా, గ్రామాల్లోకి వచ్చిన దళారులు క్వింటా పత్తికి రూ.6,700 నుంచి రూ.6,900 వరకు పెడుతున్నారు. రవాణా ఖర్చులు మిగులుతాయనే ఉద్దేశ్యంతో పాటు పంట అమ్ముకునేందుకు పాస్‌బుక్ లేకపోవడంతో దళారులకు అమ్మాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
రిమోట్‌తో కాంటా కంట్రోల్
ఈ క్రమంలో గురువారం ఆత్మకూరుకు చెందిన కొంతమంది దళారులు రెండు వాహనాల్లో వచ్చి పత్తిని కోనుగోలు చేశారు. అందులో ఒక వాహనం పత్తిలోడ్‌తో వెళ్లిపోగా మరో వాహనదారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తిని కాంటా వేసే సమయంలో వాహనంలో కూర్చున్న ఓ వ్యక్తి రిమోట్ కంట్రోల్‌తో బరువును కంట్రోల్ చేయడాన్ని గమనించిన రైతులు దళారులను పట్టుకొని నిలదీశారు. కాంటాలో 80కిలోలకు పైగా బరువు రావాల్సిన పత్తి బస్తాలు 60 కిలోల లోపే వస్తుండడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దళారులను నిలదీయడంతో తప్పు ఒప్పుకున్న దళారులు కొనుగోలు చేసిన పత్తికి క్వింటాకు ఐదు కిలోల చొప్పున అదనంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. తూకంలో 20కిలోలు మోసం చేసి 5 కిలోలు ఎలా చెల్లిస్తావంటూ నలుగురు దళారులను, వారి వాహనాన్ని రైతులు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
45రోజులుగా కొనుగోళ్లు
45 రోజులుగా రోజుకు ఒక వాహనానికి 30 క్వింటాళ్ల పత్తిని దళారులు కొనుగోలు చేశారు. గతంలో కొనుగోలు చేసిన పత్తి రైతులందరికీ క్వింటాకు 15 కిలోల చొప్పున ఆదనంగా డబ్బులు చెల్లించాలని రైతులు పోలీస్ అధికారులను కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రైతులతో ఎస్సై జక్కుల సతీష్ మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
తూకంలో మోసంతో క్వింటాకు 20 కిలోల కోత
దళారులకు
అమ్మి నష్టపోయిన రైతులు
పట్టుకొని పోలీస్‌స్టేషన్‌లో అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment