జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం | Sakshi
Sakshi News home page

జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం

Published Thu, Apr 18 2024 9:35 AM

సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి దర్శనానికి క్యూకట్టిన భక్తులు   - Sakshi

కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, భరత్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, జైపాల్‌యాదవ్‌, ఆచారి

సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు

చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్‌ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్‌, ఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం

జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం

మార్మోగిన జైశ్రీరామ్‌ నినాదాలు

ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు
1/1

ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు

Advertisement
Advertisement