కర్షకులకు చేరువగా రైతువేదికలు
● ఆధునిక పరిజ్ఞానంతో వీసీల ఏర్పాటు
● జిల్లాలోని 20 క్లస్టర్లలో అందుబాటులోకి..
● శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేరుగా ముఖాముఖి
● సాగులో విప్లవాత్మక మార్పులపై అవగాహనకు అవకాశం
అచ్చంపేట రూరల్: గ్రామీణ కర్షకులకు సలహాలు, సూచనలు అందిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. సరైన పరిజ్ఞానం లేక వ్యాపారులు చెప్పింది వింటూ నష్టపోతుంటారు. మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయాధికారులను కలిసేందుకు వెళ్లడం కష్టంగా ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదికను నిర్మించింది. వాటిలో ఏఈఓలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రైతువేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ‘రైతునేస్తం’ ద్వారా రైతువేదికలో వీడియో కాన్ఫరెన్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 20 మండలాల్లోని రైతు వేదికల్లో వీసీలు అందుబాటులోకి వచ్చాయి.
అన్ని అంశాలపై సలహాలు, సూచనలు
వ్యవసాయం రంగంలో ఆధునిక పరిజ్ఞానం రైతులకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి నుంచి ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని 20 మండలాల్లోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్సులను వ్యవసాయ శాఖ చేపడుతోంది. రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్సుకు సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాలు కంప్యూటర్, మైకులు, ఇన్వర్టర్ బ్యాటరీలతోపాటు నెట్ కనెక్షన్ ద్వారా నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతోపాటు సాగులో మెలకువలు, వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, పంటల తెగుళ్లు, చీడపీడల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, నూతన వంగడాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందేలా చూస్తారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై కూడా వీసీలో చర్చిస్తున్నారు. రెండురోజుల ముందే రైతులకు సంబంధిత అంశాన్ని తెలియజేస్తుండటంతో ఆ రోజున తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
రైతులకు ఎంతో మేలు..
రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సు మంజూరు కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలోని 20 మండలాల్లో ప్రతి దానికి ఒకటి చొప్పున వీసీలు మంజూరయ్యాయి. ఎప్పటికప్పుడు పంటల సాగులో మెలకువలను తెలియజేసే వీలుంటుంది. రైతులు రైతువేదికల వద్దకు వెళ్లి అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment