బయో‘త్పాతం’
ఆస్పత్రుల్లో అస్తవ్యస్తంగా వ్యర్థాల నిర్వహణ
నాగర్‌కర్నూల్‌లోని మున్సిపల్ డంప్ యార్డులో బయో మెడికల్ వ్యర్థాలు
రోజుల తరబడి నిల్వతో ప్రమాదం..
ప్రభుత్వం నిర్దేశించిన ఏజెన్సీతో బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణపై ప్రతి ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకోవాలి. అందుకు అవసరమైన చార్జీలను ఆస్పత్రులు చెల్లించాలి. కానీ చాలా ఆస్పత్రుల నిర్వహణ భారం పేరుతో ఇన్సినరేటరీలకు అప్పగించకుండా మున్సిపాలిటీ సిబ్బందికే బయోమెడికల్ వేస్టేజ్‌ను అప్పగిస్తున్నారు. ఆస్పత్రిలో పోగైన బయోమెడికల్ వేస్టేజ్‌ను 48 గంటల్లోగా సంబంధిత ఇన్సినరేటరీకి అప్పగించాల్సి ఉండగా, వారం నుంచి పది రోజుల పాటు నిల్వ చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఉన్న ఆస్పత్రులు పాటించడం లేదు. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో వెలువడుతున్న బయోమెడికల్ వ్యర్థాల సేకరణ నిబంధనల ప్రకారం సాగడం లేదు. ఆస్పత్రుల్లో పోగుపడుతున్న బయో మెడికల్ వ్యర్థ్యాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తూ డంపింగ్‌యార్డులకు చేరుస్తుండటంతో సిబ్బంది అనారోగ్యం బారిన పడాల్సివస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బయోమెడికల్ వ్యర్థాల సేకరణను ప్రభుత్వం ఓ ప్రైవేటు ఇన్సినరేటరీ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థలు 11 ఉన్నాయి. ఆయా సంస్థలతో ఆస్పత్రులు అనుసంధానమై బయో మెడికల్ వేస్టేజ్‌ను అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత ఏజెన్సీకి ఆస్పత్రులు ఒక్కో బెడ్‌కు రూ.7 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆస్పత్రుల నుంచి బయో మెడికల్ వేస్టేజ్ సేకరణ సక్రమంగా సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపల్ సిబ్బందికి అవగాహన లేక..
ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను సంబంధిత ఇన్సినరేటరీలు సేకరించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కన్పిస్తోంది. ప్రమాదకరమైన బయోమెడికల్ వేస్టేజ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డులకు చేరుతోంది. ఈ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో సేకరించవద్దని కఠిన చట్టాలు, నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు వీటిపై సిబ్బందికి సరైన అవగాహన లేదు. మున్సిపల్ సిబ్బంది బయోమెడికల్ వ్యర్థాలను సేకరించడం, వాహనాల్లో తరలించడం, డంపింగ్ యార్డులో నిల్వ చేస్తుండటంతో సిబ్బందితో పాటు సమీప ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ఇన్సినరేటరీలకు అప్పగించాలి కానీ ఇతర వ్యర్థాలతో కలపవద్దన్న నిబంధనలను ఆస్పత్రులు పాటించడం లేదు. ఫలితంగా హానికరమైన బయోమెడికల్ వ్యర్థాలు జనారోగ్యానికి, జంతువులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
ప్రత్యేక బ్యాగుల్లో వ్యర్థాల సేకరణ..
ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు, డిస్పెన్సరీలతో పాటు పశువైద్య సంస్థలు, బ్లడ్‌బ్యాంకులు, ఆయుష్ ఆస్పత్రులు, పరిశోధన విద్యాసంస్థలు, ఆరోగ్య శిబిరాలు, ఆపరేషన్ థియేటర్ల నుంచి బయో మెడికల్ వ్యర్థాలు వెలువడుతాయి. వీటిని నాలుగు రకాలుగా విభజించి నిల్వ చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రెడ్, ఎల్లో, వైట్, బ్లాక్ బ్యాగులను కేటాయించి వీటిల్లో విడివిడిగా వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. సిరంజీలు, సాయిల్డ్, గ్లౌస్‌లు, కాథెటర్స్, ఐవీ ట్యూబులను రెడ్ కలర్ బ్యాగ్‌లో.. బాడీ ఫ్లుయిడ్స్, బ్లడ్‌బ్యాగులు, మానవ శరీర వ్యర్థాలు, శరీర భాగాలతో కూడిన డ్రెస్సింగ్ పట్టీలను ఎల్లో బ్యాగులో వేయాల్సి ఉంటుంది. సూదులు, షార్ప్‌లు, బ్లేడ్‌లను వైట్ పంక్చర్ ప్రూఫ్ కంటైనర్(పీపీసీ) బ్యాగులో వేయాలి. బయో మెడికల్ కాని వ్యర్థాలను బ్లాక్ కలర్ బ్యాగులో వేయాల్సి ఉంటుంది. ఆస్పత్రులు ఈ నిబంధనలను అమలుచేయాల్సి ఉండగా చాలా వరకు పాటించడం లేదు. ఫలితంగా సాధారణ వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్లక్ష్యంగా మెడికల్ వేస్టేజ్ సేకరణ
నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చెత్త ట్రాక్టర్లకు అందజేత
వ్యర్థాలను చెత్తలో కలిపేయడంతో మరింత ప్రమాదం
డబ్ల్యూహెచ్‌ఓ,
పీసీబీ నిబంధనలు బేఖాతరు
పట్టించుకోని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు
నిబంధనలు పాటించేలా చూస్తాం..
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బయో వేస్టేజ్‌ను తప్పనిసరిగా సంబంధిత ఇన్సినరేటరీలు తీసుకెళ్లాలి. ఆస్పత్రులు బయో వేస్టేజ్‌ను ప్రత్యేకమైన డబ్బాల్లో సేకరించి ఇన్సినరేటరీలకు అప్పగించాలి. త్వరలోనే ఆస్పత్రుల్లో విజిట్ నిర్వహించి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. సంబంధిత ఇన్సినరేటరీలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూస్తాం.
– స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment