కానరాని బయోమెట్రిక్
● ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు నోచుకోని వైనం
● విధులకు డుమ్మా కొడుతున్న కొందరు ఉపాధ్యాయులు
● పలుచోట్ల ఏడాదిగా అటెండెన్స్ బంద్
ఫిర్యాదులు వస్తే..
ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారనే విషయంలో ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని గతంలో అమలు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా జియో అటెండెన్స్ అమలు చేయడం లేదు. బయోమెట్రిక్ హాజరుపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం. జిల్లాలో ఉపాధ్యాయులు సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు.
– గోవిందరాజులు, డీఈఓ
అమలు చేయాలి..
ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఆ విధానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలన్నా.. విద్య అందరికి అందాలన్నా.. బయోమెట్రిక్ విధానం లేదా జియో అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలి.
– కృష్ణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్ణీత సమయాల్లో బడులకు చేరే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానం ఏడాదికాలంగా లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహారం సాగుతుంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో బయో అటెండెన్స్‌తోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. కానీ, గతేడాది అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు 862 ప్రభుత్వ పాఠశాలల్లో 3300 వరకు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. కొంతమంది సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఎన్నికలకు ముందు కొన్ని ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఆ విధానాన్ని నిలిపివేశారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి పరికరాలు ఉన్నా వాటిని ఉపయోగించకపోవడం విమర్శలకు తావిస్తుంది. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఉపాధ్యాయుల తీరుతో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
బిజినెస్‌లపై దృష్టిపెట్టి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు కొంతమంది ప్రైవేట్ బిజినెస్‌లు చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. ఇతర వ్యవహారాలు నడిపిస్తున్నారు. సొంత వ్యాపారాలు, ఆదాయం వచ్చే వాటిపై దృష్టిపెడుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ రంగంతోపాటు ఇన్సూరెన్స్, వడ్డీ వ్యాపారాలు, జీరో చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఏదో ఉదయం పూట పాఠశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకాలు పెట్టి.. తర్వాత తమ సొంత వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పాఠశాలలో ఉన్న ఇతర ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను సంఘాల పేరుతో భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెట్‌వర్క్ సమస్య
జిల్లావ్యాప్తంగా బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పెట్టడానికి ప్రధానంగా నెట్‌వర్క్ సమస్యతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సరిగా పనిచేయడం లేదనే ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒక ఉపాధ్యాయుడు బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసేందుకు కనీసం 2 నుంచి 3 నిమిషాల సమయం పట్టేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ఉంటే వారంతా హాజరు వేయడానికే అరగంటకు సమయం పడుతుందని చెబుతున్నారు. ఫలితంగా ఉపాధ్యాయుడు పాఠశాలకు 9 గంటలకు వచ్చినా ఆలస్యంగా వచ్చాడనే ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment