పకడ్బందీగా కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే
నాగర్‌కర్నూల్: కుటుంబ డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ నరేష్‌బాబు, సిబ్బంది నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల నుంచి సర్వే ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు. ముందుగా గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేయాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహణ పరిశీలన కోసం జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ రవిని ప్రభుత్వం నియమించిందని చెప్పారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తాలు, తరుగు పేరుతో రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, సెంటర్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుని కేంద్రాలను నిర్వహించాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిచ్చర్, వేయింగ్ మిషన్స్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాల పకడ్బందీ నిర్వహణ కోసం తహసీల్దార్, ఎస్‌ఐతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరితగతిన చేపట్టాలి
నాగర్‌కర్నూల్ (బిజినేపల్లి): పైలెజ్ ప్రాజెక్టు కింద మండలంలోని బోయాపూర్‌లో చేపట్టిన డిజిటల్ కార్డు సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి ఐఏఎస్ రవినాయక్ సూచించారు. గురువారం ఆయన బోయాపూర్‌లో డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు తప్పకుండా నమోదు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రా ములు, ఎంపీడీఓ కథలప్ప తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment