నిధుల గోల్‌మాల్?
కందనూలు పురపాలికలో..
వేతనాల పేరుతో ఇతరుల ఖాతాల్లోకి మళ్లింపు
●
అన్ని వివరాలు సేకరిస్తున్నాం..
వేతనాల పేరుతో ప్రైవేటు ఖాతాల్లోకి నిధుల మళ్లింపుపై విచారణ కొనసాగుతోంది. నెలవారీగా ఎవరెవరి ఖాతాలో వేతనాలు జమ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. పూర్తి వివరాలను వెల్లడిస్తాం.
– నరేష్‌బాబు,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కౌన్సిలర్లు ఇష్టారాజ్యంగా బిల్లుల పేరుతో ప్రజాధనం స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలకు సంబంధించి పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు మాత్రం ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
కొనసాగుతున్న విచారణ..
మున్సిపాలిటీలో నిధులు పక్కదారి పట్టిన విషయంపై గుట్టుగా విచారణ కొనసాగుతోంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని బయటికి పొక్కనివ్వడం లేదు. అయితే పక్కదారి పట్టిన నిధులకు సంబంధించి ఏఏ ఖాతాలకు మళ్లించారు.. ఎన్ని నిధులు జమ చేశారు.. ఎన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందనే విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిధుల గోల్‌మాల్ జరిగిన విషయాన్ని బహిర్గతం చేయకపోవడం.. గుట్టుగా విచారణ చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధులు పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటారా.. లేక కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. కోటికి పైగా అంటూ ప్రచారం..
మున్సిపాలిటీలో నిధులు పక్కదారి పట్టడం చర్చనీయాంశంగా మారింది. 2020 నుంచి ఈ తంతు కొనసాగుతోందని.. రూ. కోటికి పైగా నిధులు ఇతరుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అవినీతికి పాల్పడిన ఉద్యోగి ఎన్నేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాడో.. అప్పటి నుంచి జీతాల చెల్లింపుపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
రూ. కోటికి పైగా స్వాహా!
ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణల వెల్లువ
అందులో ఒకరు రెగ్యులర్..
మరొకరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
గుట్టుగా కొనసాగుతున్న విచారణ
ఇద్దరు ఉద్యోగులే సూత్రధారులు?
మున్సిపాలిటీలో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఓ రెగ్యులర్ ఉద్యోగి, మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం సదరు రెగ్యులర్ ఉద్యోగి బాగోతం పసిగట్టిన అప్పటి మున్సిపల్ కమిషనర్ కేవలం హెచ్చరికలతో మాత్రమే సరిపెట్టినట్లు తెలిసింది. అప్పట్లోనే సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకొని ఉంటే, ఇంత పెద్దఎత్తున అవినీతికి పాల్పడే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సదరు రెగ్యులర్ ఉద్యోగి జీతాల విషయంలో కార్మికులను ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. అంతే కాకుండా మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం తీసుకువచ్చిన సిమెంట్, ఇతర సామగ్రిని తన సొంత ఇంటి నిర్మాణానికి వినియోగించుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment