వరికొయ్యలను కాల్చొద్దు
నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
మహిళల
ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
తెలకపల్లి: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నట్లు ఐకేపీ డీపీఎం (ఫైనాన్స్) వెంకటేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాశక్తి పథకంలో 14 యూనిట్లు ఉన్నాయని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించి, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళాశక్తి పథకంలో డ్వాక్రా బజార్, సూపర్ మార్కెట్లను కూడా నిర్వహించుకోవచ్చని తెలిపారు. బ్యాంక్ లింకేజీ టార్గెట్‌ను పూర్తిచేయాలన్నారు. రుణ బీమా, ప్రమాద బీమా, సీ్త్రనిధి సురక్ష రుణం, బీమా పథకంలో ఉండి, మరణించిన సభ్యుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో భాగంగా మహిళలను సంఘాల్లో చేర్పించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎం నిరంజన్, సమాఖ్య కార్యదర్శి రేణుక, కోశాధికారి అమృత, గాయత్రి, మంజుల, చంద్రకళ, సరిత, భాగ్యలక్ష్మి, సీసీలు నర్సింహ, సుజాత, నిరంజన్ ఉన్నారు.
‘బకాయిలు చెల్లించండి’
నాగర్‌కర్నూల్ రూరల్: బెస్ట్ అవేలబుల్ స్కూల్ స్కీం బకాయిలను చెల్లించి, విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలని కోరుతూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మూడావత్ శంకర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తారాసింగ్, అంతటి కాశన్న మాట్లాడుతూ.. బెస్ట్ అవేలబుల్ స్కీం ద్వారా రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో 9 వేల మంది దళిత పిల్లలు, 6వేల మంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన రూ. 175 కోట్లు బకాయి ఉండటంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుల్తాన్, అశోక్, భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment