తుది దశకు సర్వే
● జిల్లాలో 99.4 శాతం ప్రక్రియ పూర్తి
● పట్టణ ప్రాంతాల్లోనే వేగవంతం
● మండలాలు, మున్సిపాలిటీల్లో
మొదలైన డేటా ఎంట్రీ
●
పొరపాట్లు జరగొద్దు..
సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎంట్రీ చేయాలి. రోజువారీగా ఆపరేటర్లకు ఎన్ని ఫారాలను ఇస్తున్నారు.. వాటి సమయం.. తదితర వివరాలను నమోదు చేసేలా ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. ఎన్యుమరేటర్‌తో పాటు సూపర్‌వైజర్‌ను ఎంట్రీ సమయంలో అందుబాటులో ఉంచుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకోవాలి. డేటా ఎంట్రీ ప్రక్రియను మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సందేహాలుంటే మా దృష్టికి తేవాలి.
– దేవ సహాయం, అదనపు కలెక్టర్
అచ్చంపేట: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 99.4 శాతం పూర్తయింది. దీంతో అధికార యంత్రాంగం డేటా ఎంట్రీపై దృష్టి సారించింది. అందుకోసం మండలానికి ఇద్దరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను ఎంపిక చేసింది. ఆన్‌లైన్ నమోదుకు మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించారు. జిల్లాలోని 20 మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సమగ్ర సర్వే వివరాల క్రోడీకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తొలుత శిక్షణ పొందిన కంప్యూటర్ ఆపరేటర్లు ఆయా మండలాల పరిధిలో వివిధ శాఖల నుంచి మరికొందరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తీసుకొని మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. అవసరం మేరకు ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను సైతం వినియోగించుకునే అవకాశం ఉంది.
మున్సిపాలిటీల్లో 100.8 శాతం..
ఈ నెల 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించాల్సి ఉండగా.. ప్రశ్నావళి పత్రాలు సకాలంలో రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. 8వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు.. 9వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 2,50,596 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించగా.. సోమవారం వరకు 2,49,180 కుటుంబాల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 100.8 శాతం సర్వే పూర్తి కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 99.3 శాతం పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో సర్వే వేగంగా సాగుతోంది. సర్వే నిమిత్తం 1,979 మంది ఎన్యుమరేటర్లను నియమించగా.. రోజువారీ సర్వే వివరాలను సూపర్‌వైజర్లకు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం నాలుగింటికి అందిస్తున్నారు. వారు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. మిగిలిన ఇళ్ల సర్వే ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.
24 సెంటర్లలో డేటా ఎంట్రీ..
జిల్లాలోని 20 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో 2,100 మంది ఆపరేటర్లను నియమించారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు 20 నుంచి 25 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 180 మంది సూపర్‌వైజర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కుటుంబాల ఆధారంగా నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్వే వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అధికారులు కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీలను క్రియేట్ చేశారు. పాస్‌వర్డ్‌లను వారు సొంతంగా క్రియేట్ చేసుకుని, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కో కుటుంబం సమాచారం నమోదు చేసేందుకు 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. మొత్తం 56 అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసిన కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. రోజువారీగా ఏ ఎన్యుమరేషన్ బ్లాక్‌లోని ఎన్ని ఫారాల సమాచారాన్ని ఎంట్రీ చేశారనే సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. అందులో డీఈఓ, సూపర్‌వైజర్ సంతకాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment