ప్రైవేటు ఆస్పత్రుల్లో జనాన్ని పీడిస్తే సహించం
● వైద్యరంగంలో వినూత్న పథకాలు
● ప్రతి 30 కిలోమీటర్లకు
ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
● రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
దేవరకద్ర/భూత్పూర్: ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. దేవరకద్రలో రూ.35 కోట్లతో నిర్మించే వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను దోపిడీ చేసే ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలకు ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఆస్పత్రుల యాజమాన్యంపై కఠిన చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. వైద్యరంగంలో వినూత్న పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై చోటుచేసుకునే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణం వైద్యసేవలు అందించేందుకు ప్రతి 30 కిలో మీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కోసెంటర్ ఏర్పాటుకు రూ.5 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు చెప్పారు. దేవరకద్ర, మక్తల్‌లో ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కిడ్నీ రోగులకు అందుబాటులో ఉండేలా ప్రతి 30 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నచింతకుంటలోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేవరకద్రలో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. వైద్యసేవల కోసం 8 వేల మంది డాక్టర్లు, నర్సులను నియమించినట్లు మంత్రి చెప్పారు.
అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. భూత్పూర్ మండలం కప్పెటలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఇళ్లు, నాలుగేళ్ల నుంచి పింఛన్లు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేల చొప్పున అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ డా.అజయ్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment