రోడ్డు భద్రత అందరి బాధ్యత
నాగర్‌కర్నూల్ క్రైం: రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు చేపట్టిన ర్యాలీని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది సమష్టి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనం నడపరాదన్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, అతివేగం, అజాగ్రత్తతో ఓవర్‌టెక్‌లు చేయడంలాంటి వాటితో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. బ్లూకోల్ట్ కానిస్టేబుళ్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఏఎస్పీ రామేశ్వర్, డీటీఓ చిన్నబాలు, డీఎస్పి శ్రీనివాస్, ఆర్టీసీ డీఎం యాదయ్య పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భజనం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్‌కర్నూల్ మండలంలోని గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంట గదుల్లో శుభ్రత, ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి తరగతి గది శుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారం అందించడం అత్యంత ప్రధానమని అన్నారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కూరగాయలు, బియ్యం, ఇతర పదార్థాల నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని.. వాటిని సరైన రీతిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోజువారీ మెనూ పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పదో తరగతి సిలబస్ పూర్తిపై విద్యార్థులతో ఆరా తీశారు. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
వాహనదారులు విధిగా
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment