దివ్యాంగులకు రాయితీ రుణాలు
నాగర్‌కర్నూల్: ఆర్థిక పునరావాస పథకం కింద 2024–25 సంవత్సరానికి గాను దివ్యాంగులకు రాయితీపై రుణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి, పునరావాసం, చేతివృత్తులు, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకునే దివ్యాంగులకు నాన్ బ్యాంక్ లింకేజీ యూనిట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 2వ తేదీలోగా https:tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
నాగర్‌కర్నూల్/బల్మూర్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బల్మూరు మండలం చెన్నారం గ్రామపంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌ను సస్పెన్షన్ చేస్తూ బుధవారం కలెక్టర్ బదావత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం గ్రామంలో చేపట్టిన సభకు గైర్హాజరు కావడం.. ఇతర అంశాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో సస్పెన్షన్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రూ.2కోట్లతో అభివృద్ధి
అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 2కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం జరిగిన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ. 40లక్షలతో డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏప్రిల్ నెలాఖారు నాటికి మున్సిపల్ కార్యాలయ నూతన భవనం ప్రారంభిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, వైస్ చైర్‌పర్సన్ పోరెడ్డి శైలజ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత, కౌన్సిలర్లు గౌరీశంకర్,మన్నుప్రసాద్, రమేష్‌రావు, అంతటి శివ, తగురం శ్రీనివాసులు, సోమ్లానాయక్ ఉన్నారు.
పీహెచ్‌సీలో
కేంద్ర బృందం తనిఖీ
మన్ననూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జాతీయ జనాభా పరిశోధన కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పీహెచ్‌సీ పరిసరాలతో పాటు రోగులకు అందిస్తున్న సేవలు, వైద్య పరికరాలను కేంద్ర బృందం డా.కవిత, డా.మాలవిక పరిశీలించారు. అనంతరం వైధ్యాధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. నల్లమలలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, పరిస్థితులను తెలుసుకున్నారు. ఆస్పత్రి సేవల్లో భాగంగా మందులు, ఇంజక్షన్లు, తదితరాలతో పాటు ఇంటర్నెట్ సౌకర్యాలపై ఆరా తీశా రు. డయాగ్నొస్టిక్, పల్లె దవాఖాన, ఆయుష్ సేవలపై చర్చించారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులతో పాటు ఏజెన్సీ ప్రాంత ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర బృందాన్ని పీహెచ్‌సీ సిబ్బంది శాలువాలతో ఘ నంగా సన్మానించారు. డా.సుధాకర్, డా.గౌతమ్, హెల్త్ సూపర్‌వైజర్ రాజేశ్వరి, హెచ్‌సీ హరినాయక్, శ్రీకాంత్, లక్ష్మణ్, కవిత, లక్ష్మి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్
రూ. 6,900
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 2,155 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 6,900, కనిష్టంగా రూ. 4,500 ధర పలికింది. అదే విధంగా కందులకు గరిష్టంగా రూ. 6,769, కనిష్టంగా రూ. 6,739 ధరలు వచ్చాయి. మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చిన 186 మంది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు మార్కెట్ కార్యదర్శి భగవంతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment