డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలను డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
బాలికపై లైంగికదాడి
ఆత్మకూరు(ఎం): బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు చొరబడి ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్. కృష్ణయ్య తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
త్రిపురారం: నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. సోమవారం నిడమనూరు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నారమ్మగూడెం గ్రామాని చెందిన బొడ్డుపల్లి కోటయ్య(42) మిర్యాలగూడ పట్టణంలో ఓ మిల్లు లీజుకు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 23వ తేదీ ఉదయం మిల్లు వద్దకు వెళ్తున్నానని భార్య నిర్మలకు చెప్పి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం నిర్మల మిల్లు వద్దకు వెళ్లి చూడగా మిల్లు మూసి ఉంది. అప్పటి నుంచి ఎంత వెతికినా కోటయ్య ఆచూకీ లభించలేదు. సోమవారం నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గొర్రెల మంద, కాపరిపై కుక్కల దాడి
అర్వపల్లి: మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో సోమవారం వీధి కుక్కలు గొర్రెల మందతో పాటు గొర్రెల కాపరిపై దాడి చేసి గాయపర్చాయి. రామన్నగూడెం గ్రామానికి చెందిన వజ్జె వినయ్ తమ గొర్రెలను కొత్తగూడెం గ్రామ శివారులో మేపుతుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా వినయ్‌పై దాడిచేసి గాయపర్చాయి. అనంతరం గొర్రెల మందపై దాడి చేయగా.. ఒక గొర్రె అక్కడికక్కడే చనిపోయింది. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. అనంతరం వీధి కుక్కలు దూదేకుల కుంట వద్ద, గ్రామ శివారులోని వీకే గార్డెన్ సమీపంలో మేస్తున్న గొర్రెలపై కూడా దాడి చేయగా అందులో కొన్ని గొర్రెలు గాయపడ్డాయి. రూ.20వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
నిప్పంటుకొని
ధాన్యం దగ్ధం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని చిల్లాపురం గ్రామంలో దుబ్బాక వెంకటయ్యకు చెందిన ధాన్యం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంకటయ్య తన వ్యవసాయ బావి వద్ద ధాన్యం అరబెట్టగా.. సోమవారం మంటలు అంటుకొని సుమారు 30క్వింటాళ్ల ధాన్యం దగ్ధమైంది. వెంకటయ్య కుంటుంబ సభ్యులు గమనించి మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment