మట్టి తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న రైతులు
కోదాడరూరల్: కోదాడ మండలం కాపుగల్లు రెవెన్యూ పరిధిలోని రెడ్లకుంట శివారులో ఆర్‌కే మేజర్ 7–ఎల్ కాల్వ వద్ద సర్వే నంబర్ 292లో గల ప్రభుత్వ భూమిలో కొందరు వ్యాపారులు మట్టిని తవ్వి కోదాడలోని వెంచర్లకు అమ్ముకుంటున్నారు. మట్టి తవ్వొద్దని చెప్పినా వినకుండా అలాగే తరలిస్తుండగా ఆగ్రహించిన రెడ్లకుంట రైతులు సోమవారం టిప్పర్లు, ప్రొక్లెయిన్‌లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, స్థానికులు మాట్లాడుతూ.. కొందరు వ్యాపారులు ప్రభుత్వ భూమి నుంచి ఇష్టానుసారంగా 10 నుంచి 20 అడుగుల మేర వరకు మట్టిని తవ్వుతున్నారని తెలిపారు. అడ్డుకుంటే తమ పైనే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. పొలాను ఆనుకొని మట్టిని లోతుగా తవ్వడంతో మడుల్లో నీరు నిలవక అనేక ఇబ్బందులు పడతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల కిందట నేరుగా ఆర్‌కే మేజర్ క్వాలను పూడ్చి మట్టిని తరలించారని దీంతో నీరు పొంగి పంట పొలాలపై పడడంతో రైతులు ఎన్‌ఎస్‌పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కాల్వలో మట్టిని తొలగించారన్నారు. ఏడాదిన్నర కిందట ఇదే విధంగా మట్టిని తరలిస్తుండడంతో మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ప్రొక్లెయిన్‌ను సీజ్ చేశారని తెలిపారు. సోమవారం టిప్పర్లు, ప్రొక్లెయిన్‌లను రైతులు అడ్డుకుని అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వస్తున్న విషయాన్ని తెలుసుకుని వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.
ఫ ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వి వెంచర్లకు అమ్ముకుంటున్నారని ఆరోపణ
ఫ అధికారులకు సమాచారం ఇవ్వడంతో టిప్పర్లను వదిలేసి పరారైన వ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment