జగమేలు నాయక.. జగదానంద కారక
● వైభవంగా నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో నృరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలంలో యోగా నృసింహ గారుడ వాహనముపై దేదీప్యమానంగా వెలుగొందిన లక్ష్మీనారసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం తెల్లవారు జామునే మూలమూర్తి జ్వాలనరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్లను మేలుకొలిపి, సుప్రభాత సేవ, నిత్యపూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలనరసింహ స్వామి ఉభయ దేవేరులతో ప్రత్యేకాలంకరణ గావించిన యోగానంద గరుడ విమాన వాహనంలో కొలువై ఆస్థాన విధ్వాంసుల మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు.
నేటి నుంచి ఈఏపీ సెట్
● జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ
నంద్యాల(న్యూటౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీఈఏపీసెట్)–2024 గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న పరీక్షలకు అధికారులు రామకృష్ణ డిగ్రీ, పీజీ, ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలను కేంద్రాలుగు ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అగ్రికల్చరల్ ఫార్మసీ(బైపీసీ) విద్యార్థులకు ఈనెల 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీమ్(ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌కు 5,478 మంది, అగ్రికల్చల్ ఫార్మసీకి 2,517 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజు రెండు సెషన్స్‌లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
నేడు సీడీసీ డీన్‌లతో సమీక్ష
కర్నూలు కల్చరల్: విజయవాడలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్‌లతో గురువారం యాప్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల అఫ్లియేషన్ అంశంపై చర్చించనున్నారు. శుక్రవారం వర్సిటీల అకడమిక్ అఫైర్స్ డీన్‌లు, పరీక్షల విభాగం డీన్‌లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లతో సమీక్షిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలండర్, పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయం నుంచి సీడీసీ, అకడమిక్ అఫైర్స్, ఎగ్జామినేషన్స్ డీన్‌లు పాల్గొననున్నారు.
17న ఉరుకుందలో వేలం పాటలు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 17న వివిధ వ్యాపారాల లైసెన్స్ కోసం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్, ట్రస్టుబోర్డు చైర్మన్ నాగరాజ్‌గౌడ్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. 18న స్వామివారి హుండీ ఆదాయం లెక్కించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment