ఏవీ వర్సెస్ భూమా అఖిల
● ఆళ్లగడ్డలో మళ్లీ పురుడుపోసుకున్న ఫ్యాక్షన్
● టీడీపీ నేతల నిర్వాకంతో
ఆందోళనలో ప్రజలు
సాక్షి, నంద్యాల: ప్రశాంతమైన పల్లెల్లో తెలుగుదేశం పార్టీ నేతలు చిచ్చు రగిలిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై హత్యాయత్నం జరగడంతో ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడం కోసం దాడులను ప్రోత్సహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉప్పూ.. నిప్పులా ఏవీ, అఖిల
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఉప్పూ నిప్పులా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తమ ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి అక్రమంగా హస్తగతం చేసుకున్నాడని అఖిలప్రియ ఆరోపిస్తూ వస్తున్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో అడుగుపెడితే ఊరుకునేది లేదని బహిరంగంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆళ్లగడ్డలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అఖిలప్రియ సమక్షంలోనే ఏవీపై దాడి జరిగింది. అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ ఏవీ చొక్కా పట్టుకొని పక్కకు లాగేసి ముఖం మీద పిడిగుద్దులు కురిపించడంతో సుబ్బారె డ్డికి రక్త గాయాలయ్యాయి. లోకేష్ ఉండగానే పరస్పరం ఘర్షణలకు పాల్పడడంతో ఇద్దరిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఎన్నికలు ముగిసే వరకు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుబ్బారెడ్డి నంద్యాలకే పరిమితమయ్యారు.
ఆళ్లగడ్డలో అడుగు పెడితే బాగోదు..
యువగళం ఘటన నాటి నుంచి ఏవీ, అఖిలప్రియ ఎదురుపడే సందర్భం రాలేదు. ఈ ఫిబ్రవరిలో ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా.. కదలి రా సభలో పాల్గొనేందుకు ఏవీ ప్రయత్నం చేశారు. సభకు ఏవీ హాజరైతే తీవ్రంగా స్పందిస్తానని అఖిలప్రియ బహిరంగంగానే హెచ్చరించింది. మరోవైపు ఆళ్లగడ్డకు రావొద్దు అనడానికి ఆమె ఎవరంటూ ఏవీ ప్రశ్నించడంతో పాటు సభకు హాజరవుతానని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముంగింట్లో పార్టీలోని నేతలు గొడవలకు పాల్పడితే పార్టీ పరువు బజారున పడుతుందని భయపడిన ఆ పార్టీ నేతలు ఏవీకి సర్ది చెప్పి సభకు రాకుండా ఆపగలిగారు.
పగతో రగిలిపోతున్న సుబ్బారెడ్డి
అఖిలప్రియ వ్యవహారశైలితో ఏవీ సుబ్బారెడ్డి విసిగిపోయారు. ఆమె చర్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లుతుందని గ్రహించారు. మరోవైపు దాడి చేసిన వాడిని వదిలేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని అనుచరులు చెప్పడంతో తగిన బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి ఏవీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగియగానే పక్కా ప్రణాళికతో నిఖిల్‌పై దాడి చేశారు. అఖిలప్రియ ఇంటి వద్దే దాడి చేసి తమ జోలికి వస్తే తాము తీవ్రంగా స్పందిస్తామనే సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది.
తీవ్రంగా గాయపడిన నిఖిల్
నిఖిల్ కదలికలపై కొద్దిరోజులుగా రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది. భూమా అఖిల ఇంటి వద్దే నిఖిల్‌ను మట్టుబెట్టాలనే ఆదేశానుసారం బాధితునిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కారుతో ఢీకొట్టి తర్వాత ఒక్కసారిగా విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఏ ఒక్కడూ ఊర్లో ఉండడు
ఇది ఇలా ఉండగా పోలింగ్ రోజు సాయంత్రం రుద్రవరం మండలంలో అఖిల సోదరుడు భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఏ ఒక్కడినీ వదిలిపెట్టేది లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మన సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కడూ ఊరిలో ఉండడు. ఊరిని వదిలించే బాధ్యత తీసుకుంటా. భూమా నాగిరెడ్డి రాజకీయాన్ని మళ్లీ చూస్తారు.. అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. తమ ఆధిపత్యం కోసం ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు రగిలిస్తూ ఉండడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment