ఎన్నికల హామీ అమలేదీ?
నంద్యాల: కూటమి ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల కల్పన దేవుడెరుగు, ఉన్న వారికే భద్రత లేదు. వివిధ కారణాలు చూపి తొలగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన వలంటీరు వ్యవస్థకే ఇప్పుడు ఎసరు పెట్టింది. వీరు గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పేద, మధ్య తరగతి వర్గాల దరికి చేరి వారి మన్ననలు పొందారు. అలాంటి వలంటీర్లపై నేడు కూటమి ప్రభుత్వం కుట్ర చేసి వారిని శాశ్వతంగా ఇళ్లకు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషికం కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారికి వేతనాలను నిలిపి వేయడంతో పాటు నేడు వలంటీర్ల వ్యవస్థకు జీఓనే లేదని తేల్చేసింది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యారు.
తొలుత విషం చిమ్మి..
ఎన్నికల సమయంలో నమ్మించి
జిల్లాలో మొత్తం 516 గ్రామ/వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 8,761 మంది వలంటీర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ’జగనన్న సైన్యం’ అంటూ వలంటీర్ వ్యవస్థపై కూటమి నేతలు విషం చిమ్మారు. ’అదేం ఉద్యోగం? మూటలు మోసేది కూడా ఓ ఉద్యోగమేనా?’ అంటూ హేళన చేశారు. ఎన్నికలు సమీపించేకొద్దీ వారు స్వరం మార్చారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మిం చారు. వారి మాయమాటలు నమ్మిన వలంటీర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేతనాలు పెంచుతారని ఆశ పెట్టుకున్నారు. ఆరునెలలవుతున్నా విధుల్లోకి తీసుకోలేదు. జీతాలు పెంచలేదు. ఇటీవలే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని, వలంటీర్లను కొనసాగించే పరిస్థితి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో తేల్చి చెప్పడంతో కూటమి ప్రభుత్వం దగా బయటపడింది. నాడు ఓట్ల కోసం తమను నమ్మించి, నేడు అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేశారని జిల్లాలోని వలంటీర్లు మండిపడుతున్నారు.
నాడు వలంటీర్ల సేవలకు పట్టం
వలంటీర్లు ఎన్నికల ముందు వరకు తెల్లవారక ముందే అవ్వా, తాతలను నిద్రలేపి నిస్వార్థంగా పెన్షన్లు అందించారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లల చదువులకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి ముంగిట్లోనే అందించారు. ఇలా ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను పేదల దరికి చేర్చారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ గౌరవ వేతనంతో సేవలు అందించడంతో నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారిని ఏటా అవార్డులతో సత్కరించింది. గత ఫిబ్రవరిలో సేవా వజ్రకు రూ.45 వేలు, సేవా రత్నకు రూ.30 వేలు, సేవా మిత్రకు రూ.15 వేల నగదు బహుమతులు అందించి ప్రోత్సహించింది.
మోసం చేయడంలో ఎవరైనా చంద్రబాబు తర్వాతనే అనేందుకు వలంటీర్ల ఉదంతమే ఓ నిదర్శనం. ఎన్నికల ముందు వేతనం రెండింతలు పెంచుతామని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత నయవంచనకు పాల్పడ్డారు. మొదట వారి నుంచి ఫోన్లు లాక్కొన్నారు. తర్వాత జీతాలు నిలిపేసి.. సేవలకు దూరం చేశారు. తమను ఉంచుతారా.. తొలగిస్తారా.. అనే అయోమయంలో ఉన్న వలంటీర్లకు తాజాగా కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో రోడ్డున పడ్డారు.
నంద్యాల(న్యూటౌన్): ఎన్నికల ముందు వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనం పెంచుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిని అమలు చేయాలని వలంటీర్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వారు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, కార్యదర్శి బాలవెంకట్ మాట్లాడుతూ గ్రామ, వార్డు వలంటీర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.10వేలకు పెంచాలన్నారు. దీనిపై వెంటనే సర్కారు స్పందించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, వలంటీర్లు లక్ష్మణ్, మధుశేఖర్, సుధాకర్, భాగ్యలక్ష్మి, స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment