జిల్లాలో 143 మంది పోలీసుల బదిలీ
బొమ్మలసత్రం: జిల్లాలో ఒకే చోట 5 ఏళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న 143 మంది పోలీసులకు జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా బదిలీ చేశారు. ఆయన నాలుగు సబ్‌డివిజన్‌ల డీఎస్పీలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్టేషన్లలో పనిచేసే 55 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 28 మంది ఏఎస్‌ఐలను స్థానం చలనం కల్పించినట్లు వెల్లడించారు. వీరంతా ఐదేళ్లకు పైబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నందున బదిలీలు చేశామన్నారు. వెంటనే బదిలీ పోలీసులు కేటాయించిన స్టేషన్లలో విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, డీఎస్పీలు రామాంజినాయక్, శ్రీనివాసరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
25లోగా ‘పది’ పరీక్ష రుసుము చెల్లించాలి
నంద్యాల(న్యూటౌన్): పదోతరగతి పరీక్ష ఫీజును ఈనెల 25లోగా చెల్లించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26వ తేది వరకు గడువు ఉందని, అయితే, చివరి రోజు ఏదైనా సర్వర్ సమస్య తలెత్తితే ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక రోజు ముందే ఫీజు కట్టేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
మద్దిలేటయ్య ఒక్క రోజు ఆదాయం రూ. 5,95,257
బేతంచెర్ల:శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామికి శనివారం ఒక్కరోజే రూ. 5,95,257 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం నాలుగో శనివారాన్ని పురస్కరించుకుని స్వామి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వివిధ సేవల ద్వారా ఆలయానికి భారీ ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ రామాంజనేయులు తెలిపారు.ఆలయ సందర్శన కు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు నామధారణతో పాటు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: పట్టణంలోని కలెక్టరేట్ సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
శ్రీశైల జలాశయానికి
తగ్గిన ప్రవాహం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం దాదాపుగా తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం వరకు సుంకేసుల నుంచి కేవలం 154 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. జలాశయం నుంచి మాత్రం 43,364 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాజెక్ట్‌లకు విడుదలైంది.అందులో అత్యధిక పరిమాణాన్ని తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు తరలించారు. ఎడమగట్టుకేంద్రంలో 14.912 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 32,625 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,149 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,590 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం సాయంత్రం సమయానికి సుంకేసుల నుంచి శ్రీశైలంకు 1,368 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.డ్యాం నీటిమట్టం 871.70 అడుగులకు చేరుకోగా, జలాశయంలో 149.0620 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
రూ. 5 లక్షల విరాళం
ఆలూరు: స్థానిక శ్రీ బెళ్లగుండా ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి ఆలూరు పట్టణానికి చెందిన సోడాల వెంకటరమణ, గోవిందమ్మ దంపతులు రూ. 5 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వీకె.చౌదరి, శ్రీనివాసులు దాతలను అభినందించి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment