ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల విచ్చలవిడి అవి
‘‘ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు రూ.2 లక్షలు, రూ.5 లక్షలు లంచాలు తీసుకుని డీలర్‌షిప్‌లు, ఇతరత్రా పోస్టులు ఇప్పిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలతోనే లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ చెప్పిన సిఫార్సు కంటే లంచాలు ఇచ్చిన వారికే పోస్టులు ఇస్తున్నారు. లంచాల తతంగాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళతా! లేదంటే టీడీపీని మోసం చేసిన వాడినవుతా!’’ – ఈ నెల 18న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో, లంచాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఏ స్థాయిలో దండుకుంటున్నారో ఇట్టే తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోనే కాదు, నంద్యాల జిల్లాలోనూ ఇదే స్థాయి అవినీతి దందా నడుస్తోంది! కర్నూలు అధ్యక్షుడు బాహాటంగానే ఆరోపణలు చేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు చేయలేదు. అంతే తేడా!
● నామినేటెడ్ పోస్టుల నుంచి కాంట్రాక్టు పనుల వరకూ చేతులు తడిపితేనే గ్రీన్‌సిగ్నల్ ● నేతలు పదవులు అమ్ముకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సంచలన ఆరోపణలు ● చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు ఆధారాలతో చిట్టా సిద్ధం చేస్తున్న వైనం ● దావోస్ నుంచి ముఖ్యమంత్రి రాగానే ఆధారాలతో సహా ఫిర్యాదు
● దేవనకొండ మండలంలో సింగిల్‌విండో చైర్మన్ పదవిని రూ.22 లక్షలకు ఆలూరు నియోజకవర్గంలోని టీడీపీ కీలక నేత ఒకరు బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
● మంత్రాలయం నియోజకవర్గం కోసిగి సింగిల్ విండో పదవిని రూ.15 లక్షలకు అక్కడి టీడీపీ కీలక నేత బేరం పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తికి ఈ పోస్టును కట్టబెట్టేందుకు ఫైల్ కదిలినట్లు తెలుస్తోంది.
● ఆలూరు నియోజకవర్గం తెర్నేకల్‌లో సిమెంట్‌రోడ్ల నిర్మాణానికి 5శాతం కమీషన్ ఇవ్వాలని ఆ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నేత కాంట్రాక్టర్లకు హుకూం జారీ చేశారు. ఆలూరులోనే కాదు ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ పథకం నిధులతో చేపడుతున్న సిమెంట్‌రోడ్లు అన్నింటిలో కమిషన్ల దందా నడుస్తోంది.
● ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో 22 మంది పారిశుధ్యకార్మికులను నియమించేందుకు అక్కడి ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు చొప్పున రూ.44 లక్షలు వసూలు చేశారు.
● డోన్‌లో హంద్రీ–నీవా నుంచి చెరువులను నింపేందుకు రూ.320 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. మైనర్ వర్క్స్ చేస్తున్న ఏజెన్సీని నిలిపేసి తమ నాయకుడిని కలవాలని టీడీపీ కీలక నేత అనుచరులు హకూం జారీ చేశారు. ఈ నియోజకవర్గంలోని అవినీతిపై ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు.
● ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని రూ.30 లక్షలకు బేరం పెట్టారు. ఇతను కూడా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తి!
సాక్షిప్రతినిధి కర్నూలు: ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లంచాల పాలన నడుస్తోంది. ఇసుక, మద్యం వ్యాపారం మొదలు నామినేటెడ్ పోస్టులు.. కాంట్రాక్టు పనులు.. ఏదీ చేయాలన్నా తమ్ముళ్లను కలవాల్సిందే.. కప్పం కట్టాల్సిందే. గత సార్వత్రిక పోరులో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు 12 అసెంబ్లీలు, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఈ స్థాయి ఫలితాలు టీడీపీ చూడటం ఇదే తొలిసారి. ఊహించని ఫలితాలతో అధికారం చేపట్టిన కూటమి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆర్థికంగా ఎదిగేందుకే రెండు చేతు లా ఒడిసిపట్టుకుంటున్నారు. అక్రమంగా ఇసుకను తవ్వి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తూ భారీగా దండుకుంటున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఇసుక దందా విచ్చలవిడిగా నడుస్తోంది. హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి పక్కనే తుంగభద్ర నదిలో మునగాలపాడు సమీపంలో జేసీబీలతో నదిలో తవ్వి రాత్రిళ్లు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి టీడీపీ కీలక నేత ఆధ్వర్యంలోనే ఇసుక దందా సాగుతోంది. మంత్రాలయంలో కూడా ఇదే తంతు నడుస్తోంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం దందా నడుస్తోంది. ఈ దందా సాగించే నేతలు పలు నియోజకవర్గాల్లోని కీలక నేతలకు నెల మామూళ్లు నిర్దేశించి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇలా ప్రతీ అంశంలో ఆదాయమార్గాన్ని చూసుకుంటున్న టీడీపీ నేతలు చివరకు నామినేటెడ్ పోస్టుల నుంచి కాంట్రాక్టుల వరకు ప్రతీ అంశంలో లంచం ఇస్తేనే పని చేస్తున్నారు. పైగా నామినేటెడ్ పోస్టులు టీడీపీ శ్రేణులకే ఇవ్వాలి. ఎమ్మెల్యేలు, పార్టీ గెలుపునకు కృష్టి చేస్తే తమతోనే పోస్టును బట్టి రేటు ఫిక్స్ చేయడంపై ఆపార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం రగిలిపోతుంది. ఈ అంశాలను పార్టీ దృష్టికి తీసుకెళుతున్నారు. అందులో భాగంగానే తిక్కారెడ్డికి పూర్తి విషయాలు తెలిసి ఏకంగా పార్టీ కార్యకర్తల సమక్షంలోనే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు లంచాలకు పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడే నేరుగా ఆరోపణలు చేశారంటే కర్నూలు జిల్లాలో అవినీతి కంపు ఏస్థాయిలో ఉందో సుస్పష్టమవుతోంది.
ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, ఆదోని నేతలపై అధిక ఫిర్యాదులు
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల యజమానులను డబ్బుల కోసం బెదిరించినట్లు బీజేపీ నేతలే ఆపార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మార్కెట్‌యార్డు అధికారులను కూడా వేధింపులకు గురిచేసినట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. కోడుమూరు నియోజకవర్గం పంచలింగాలలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ఓ పోస్టును సిఫార్సు చేస్తే, అక్కడి ఎమ్మెల్యే దస్తగిరి, ఇన్‌చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఎంపీ సిఫార్సును పక్కనపెట్టి తాము సిఫార్సు చేసిన వారికే పోస్టు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా పరోక్షంగా తిక్కారెడ్డి లేవనెత్తి విమర్శించారు. ఎంపీ చెప్పిన వారికి కాకుండా లంచాలు ఇచ్చిన వారికి పోస్టులు ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఆలూరు ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డిలపై కూడా టీడీపీ అధ్యక్షుడికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఏ నేత ఎవరిని ఎంత మొత్తంలో లంచాలు వసూలు చేశారని తిక్కారెడ్డి పూర్తి ఆధారాలతో చిట్టా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన నుంచి రాగానే ఆయనను కలిసి అవినీతి చిట్టాను వివరించనున్నారు.
కమీషన్ మాట్లాడుకోవాల్సిందే..
ఇసుక దందాను పక్కనపెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలోని పనులు టీడీపీ ఎమ్మెల్యేలు అర్ధంతరంగా నిలిపేశారు. కాంట్రాక్టర్లు వచ్చి ఎమ్మెల్యేలను కలిసి కమిషన్ మాట్లాడుకుని ఆపై పనులు చేసుకోవాలని హుకూం జారీ చేశారు. నంద్యాలలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనవికాస్ కార్యక్రమ్(పీఎంజేకే) ద్వారా హాస్టల్, స్కూలు భవనాలతో పాటు 6 మేజర్ పనులు రూ.14కోట్లతో జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో 60శాతం పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిపేశారు. వచ్చి మంత్రితో మాట్లాడిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని మంత్రి అనుచరులు కాంట్రాక్టర్‌కు చెప్పారు. ఏకంగా మంత్రి ఇలాఖాలో జరిగిన తంతు ఇది!
Comments
Please login to add a commentAdd a comment