కష్టాలు.. కన్నీళ్లు!
నంద్యాల పట్టణానికి చెందిన ఈ బాబు పేరు మదార్‌వలి. వైద్య పరీక్షలు చేయించుకోవాలని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు ఉదయాన్నే ప్రత్యేకంగా ఆటో తీసుకున్నారు. పిల్లలతో కలిసి మొత్తం ఐదుగురు అందులో ఆదోనికి వచ్చారు. ఇందుకు రూ.5 వేలకు పైగానే ఖర్చు వచ్చింది. ‘‘ ప్రభుత్వం ఇలాంటి పిల్లల పట్ల సానుకూలంగా స్పందించాలని, బుద్ధి మాంద్యం అనగానే ఎలాంటి పరీక్షలు లేకుండా చూడాలని’’ బాలుడి తండ్రి అహ్మద్ బాషా అన్నారు.
కర్నూలు(హాస్పిటల్)/ఆదోని టౌన్/గోస్పాడు: వైకల్యానికి సంబంధించి గతంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం ప్రారంభమైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని సదరం క్యాంపులో ఏర్పాటు చేసిన శిబిరానికి 60 మందికి పైగా దివ్యాంగులు హాజరయ్యారు. వినికిడి, మానసిక సమస్యలపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగుల వైకల్యాన్ని వైద్యులు పరిశీలించారు. సదరం క్యాంపునకు వచ్చిన వారిలో చాలా మంది నడవలేని పరిస్థితిలో ఉన్నవారే. సహాయకులు ఆపసోపాలు పడి వారిని శిబిరానికి తీసుకువచ్చారు. ఉదయం 9 గంటలకు వచ్చిన వారు రద్దీని బట్టి గంట నుంచి రెండు గంటల సమయం వేచి ఉండి పరీక్ష చేయించుకుని వెళ్లాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగించారు. వైద్య పరీక్షలు చేసేందుకు అనంతపురం జిల్లా నుంచి ఈఎన్‌టీ, సైకియాట్రీ వైద్యులు కర్నూలుకు వచ్చారు. వీరు వారంలో మంగళ, బుధ, గురువారాల్లో ఓపీ నెం.41(సదరం)లో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి వారి పత్రాలను పరిశీలిస్తారు.
● ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు ఆదోనితో పాటు నంద్యాల, కర్నూలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు 200 మంది హాజరయ్యారు. మానసిక వికలాంగులు ఆదోనికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తమ పిల్లల సర్టిఫికెట్ల పరిశీలించారని, ఇప్పుడు మళ్లీ వెరిఫికేషన్ పేరుతో వందల కిలోమీటర్లు తిప్పడం ఏమిటంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
● నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సూపరింటెండెంట్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో దివ్యాంగుల వైద్య పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈనెల 21 నుంచి 23 వరకు దివ్యాంగులకు పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మొదటి రోజు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలకు హాజరవుతున్న వారందరూ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
సమన్వయలోపం..
దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌కు సంబంధించి ఏర్పాట్ల విషయంలో రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. పింఛన్లు ఇచ్చేది డీఆర్‌డీఏ కాబట్టి ఏర్పాట్లు వారే చేయాలని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలోనే సదరం క్యాంపు ఉందని, వైద్యులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని డీఆర్‌డీఏ శాఖ వారు వాదించుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు ఆసుపత్రి అధికారులే శిబిరానికి అవసరమైన టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.
రూ. 5 వేలు ఖర్చు
సర్టిఫికెట్ల పరిశీలనతో దివ్యాంగులకు తప్పని తిప్పలు
మళ్లీ పరీక్షలెందుకంటూ నిట్టూర్పు
బిడ్డను ఎత్తుకుని వైద్య పరీక్షల కోసం నిల్చున్న ఈమె పేరు శారద. నంద్యాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఆదోని వైద్యశిబిరానికి వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత..‘‘ ఇన్ని కష్టాలు ఎందుకో, చిన్నారిని ఆదోని తీసుకొచ్చేందుకు కష్టాలు పడ్డాం’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment