స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
నంద్యాల: పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్, సామూహిక మరుగుదొడ్ల కాంప్లెక్స్‌లు తదితర పారిశుద్ధ్య కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త సంపద తయారీ కేంద్రాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టి సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. కొత్తపల్లి, శిరివెళ్ల, పాములపాడు, బండిఆత్మకూరు మండలాల్లో క్లోరినేషన్, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు శుభ్ర పరచడం తదితర పారా మీటర్లలో వెనుకబడి ఉన్నారని పనితీరు మెరుగుపరచుకొని ప్రగతి చూపించకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకుండా అంకెల గారతో మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు. జిల్లాలో 417 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి గాను 192 పూర్తి అయ్యాయని, ఇంకా ప్రారంభించని 167, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. పూర్తయిన సామూహిక మరుగుదొడ్లను తాను స్వయంగా తనిఖీ చేస్తానన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్ల, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment