నేడు వసంత పంచమి
● కొలను భారతిలో ఏర్పాట్లు పూర్తి
కొత్తపల్లి: సరస్వతి దేవి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం కొలనుభారతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ రామలింగారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, అక్షరాభ్యాస స్థలం, భక్తులు సేదతీరేందుకు టెంట్లు, భోజన, తాగునీటి సౌకర్యం, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. డీఎస్పీ రామాంజి నాయక్, ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్‌ఐ ఎం.కేశవ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. ఆయా శాఖల అధికారులు విధులు నిమిత్తం శనివారం అక్కడికి చేరుకున్నారు.
క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో శివపురం గ్రామ సమీపంలో వెలిసిన కొలనుభారతి క్షేత్రానికి వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వినయ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు నుంచి కొలనుభారతికి ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశామని, ఇందులో సంగమేశ్వరానికి వెళ్లే బస్సు కూడా ఉందన్నారు. శివపురం చెంచుగూడెం నుంచి క్షేత్రానికి రూ.10 చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment