మన మిత్ర వాట్సాప్ సేవలు అందించండి
నంద్యాల: మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్బన్ సచివాలయ సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటిసారి 161 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సేవలను 9552300009 నంబర్ వాట్సాప్ ద్వారా పొందవచ్చునని చెప్పారు. ప్రస్తుతం దేవదాయ, పీజీఆర్‌ఎస్, ఏపీఎస్ ఆర్టీసీ, ఎనర్జీ సర్వీసెస్, మున్సిపల్, రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్ శాఖలకు సంబంధించిన సేవలు ప్రారంభించారని చెప్పారు. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న సర్వేలను పక్కాగా చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సర్వేలకు సంబంధించి పట్టణ ప్రాంతాలలో 30 వేల యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయని త్వరితగతిన సర్వే పూర్తి చేయాలన్నారు. విద్యుత్ కమర్షియల్ కనెక్షన్ ఉన్న ప్రతి సంస్థను కూడా ఎంఎస్‌ఎంఈ యూనిట్‌గా పరిగణించి సర్వే నిర్వహించాలన్నారు. ప్రాథమిక పరస్పర వ్యవసాయ సంఘాల లబ్ధిదారుల ఈ కేవైసీ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఎల్‌డీఓ శివారెడ్డి, పరిశ్రమల జిల్లా మేనేజర్ జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment