రూ.2 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు మంగళవారం సికింద్రాబాద్‌కు చెందిన స్వరాజ్యలక్ష్మి రూ.1,00,101 విరాళాన్ని పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణనిధి పథకానికి సికింద్రాబాద్‌కు చెందిన ఎన్.సూర్యరావు రూ.1,00,101 విరాళాన్ని అందించారు. దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికలను అందజేసి ఆలయ అధికారులు సత్కరించారు.
రెండో రోజూ రైతుల నిరసన
నంద్యాల(అర్బన్): వేరుశనగ లాట్లకు సంబంధించిన అడ్వాన్స్ చెక్కులు ఇవ్వాలంటూ స్థానిక ఎన్‌ఎస్‌సీ(నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎదుట) పలు గ్రామాల రైతులు చేపట్టిన నిరస న కార్యక్రమం మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా రైతులు నెహ్రూరెడ్డి, తిరుపంరెడ్డి, వెంకటరెడ్డి, రంగస్వామిరెడ్డిలు మాట్లాడుతూ.. చెక్కులు ఇచ్చేంత వరకు ఉద్యోగులు విధులు నిర్వహించకుండా చేస్తామన్నారు. రెండు నెలలుగా చెక్కులు ఇవ్వకపోవడంతో పంట సాగు కోసం తెచ్చిన అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. చెక్కులు ఇవ్వకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. జిల్లా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
మార్చి నెలాఖరు వరకు నీరు
చాగలమర్రి:తెలుగు గంగ ప్రధాన కాల్వకు మార్చి 31వ తేదీ వరకు విడతల వారీగా సాగునీరు విడు దల చేస్తామని తెలుగు గంగ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని 25, 29 బ్లాకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు వృథా కాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ మరమ్మతులు, లైనింగ్ పనులను గుర్తించామని ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఆయన వెంట ఈఈ శివశంకర్‌రెడ్డి, డీఈలు గురుమూర్తి, అనిల్ కుమార్‌రెడ్డి, రత్నరాజు, వెంకటరమణ, ఏఈలు మోహన్ కృష్ణారెడ్డి, వినయ్ కుమార్, నాయక్ తదితరులు ఉన్నారు.
మాతాశిశు మరణాలను అరికట్టాలి
గోస్పాడు: జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టాలని వైద్య సిబ్బందిని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, నంద్యాల ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్‌లో మాతృ మరణాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌమార దశలో వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బిడ్డ ఆరోగ్యం కాపాడాలంటే సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. జగజ్జననీ నగర్ యూపీహెచ్‌సీ, కొలిమిగుండ్ల పీహెచ్‌సీ పరిధిలో జరిగిన మాతృమరణాలు, మద్దూరు, గాజులపల్లె, గోస్పాడు పీహెచ్‌సీల పరిధిలో జరిగిన శిశు మరణాలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్‌బాబు, గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల డాక్టర్ లలిత, ఎంసీహెచ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, వైద్యులు అరుణజ్యోతి, శ్రీజ, శ్రీదేవి, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కందుల కొనుగోలుకు
53 కేంద్రాలు
నంద్యాల(అర్బన్): కందులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ సిద్ధమైంది. వ్యవసాయ శాఖ ఇచ్చిన జిల్లా సగటు దిగుబడిలో 25 శాతం ప్రకారం నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ బుధవారం నుంచి కందులు కొనుగోలు చేయనుంది. మండలానికి ఒకటి చొప్పున కర్నూలు జిల్లాలో 25 , నంద్యాలలో 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. ప్రతి ఆర్‌బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా ఎక్కడికక్కడ మద్దతు ధరతో అమ్ముకునే అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా మొత్తానికి 53 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 9 వేల టన్నులు, నంద్యాల జిల్లాలో 8 వేల టన్నుల ప్రకారం కొనుగోలుకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మార్క్‌ఫెడ్ దగ్గర తగినన్ని గన్నీ బ్యాగులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment