నిర్లక్ష్యపు నీడలో 9వ శతాబ్దపు శిల్పాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో 9వ శతాబ్దానికి చెందిన (రాష్ట్ర కూటుల కాలానికి చెందిన) అపురూప శిల్పాలు ఆలనా.. పాలన లేక ముళ్ల కంచెల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ శిల్పాలను పరిరక్షించాలని కోరారు. మొగల్రాజపురం మధుచౌక్‌లోని సీసీవీఏ కార్యాలయంలో శివనాగిరెడ్డి ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. సీసీవీఏ చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్’ కార్యక్రమంలో భాగంగా నాయకల్లు గ్రామాన్ని ఆదివారం సందర్శించినట్లుగా చెప్పారు. ఆ గ్రామానికి ఉత్తరంగా ఉన్న ముళ్లపొదల్లో రాష్ట్ర కూటుల కాలపు నిలువెత్తు ఎర్ర ఇసుక రాతి శివ ద్వారపాలుడు, నల్ల శాసనపు రాతిలో చెక్కిన రెండు మహిషాసురమర్దిని శిల్పాలు, ఒక వీరగల్లు శిల్పంతో పాటుగా పొలాల్లో ఉన్న శిథిల శివాలయాల పక్కన ముళ్ల పొదల్లో నంది విగ్రహం ఉన్నాయని వెల్లడించారు. 1100 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతికి ఈ శిల్పాలు అద్దం పడుతున్నాయన్నారు. రెండు మహిషాసుర్లమర్దిని శిల్పాలు ఆనాటి శక్తి ఆరాధనను, శత్రువులతో వీరో చితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరుడు స్వర్గాన్ని చేరుకోగా, అతనికి అప్సర సలు పరిచర్యలు చేస్తున్నట్లు తెలిపే నిలువె త్తు వీరగల్లు శిల్పం ఆనాటి వీర ఆరాధనను తెలియజేస్తున్నాయన్నారు. ఈ శిల్పాలను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ తరాల కు వీటి ప్రాధాన్యతను తెలియజేసేలా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment