నారాయణపేట/మక్తల్: బడి పిల్లల ప్రాణాలమీదకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోదా అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణ ప్రశ్నించారు. మంగళవా రం మాగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం అందుకున్న ఎంపీ.. ఢిల్లీ నుంచి స్పందించారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఫోన్‌చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని నారాయణపేట, మహబూబ్‌నగర్ డీఎంహెచ్‌ఓలు, ప్రభుత్వ అస్పత్రుల సూపరింటెండెంట్లకు సూచించారు. ఈ ఘటనపై ఢిల్లీ నుంచి మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పనితీరుకు ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. మాగనూర్ పాఠశాలలో వారం రోజుల్లోనే రెండుసార్లు మధ్యా హ్న భోజనం వికటించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్లే ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బడి పిల్లలకు విషపు ఆహారం పెట్టడమే మీ ప్రజాపాలనా అని ప్రశ్నించారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు విలవిలలాడితుంటే.. ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుందని మండిపడ్డారు. బడిపిల్లలకు సరైన భోజనం పెట్టలేని కాంగ్రెస్ పాలకుల కు సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment