నారాయణపేట: రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో నాలుగు పథకాలకు ఈ నెల 26న శ్రీకారం చుట్టనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం 80 గ్రామాలు, 14 వార్డుల్లో సభలు నిర్వహించారు. లబ్ధిదారుల తుది జాబితాను 24వ తేదీలోగా సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదించేందుకు అధికార యంత్రాంగం గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా చేపట్టారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేకంగా సర్వేచేసి, ఇప్పటికే మొబైల్ యాప్‌లో దరఖాస్తుదారుల సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఈ మేరకు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రైతుభరోసా పథకానికి సంబంధించి ఎకరాకు రూ.12వేల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు. ఇందుకు సంబంధించి నిజమైన రైతులకు మాత్రమే రైతుభరోసా అందించాలనే సంకల్పంతో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సాగుయోగ్యంకాని భూములను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయేతర భూములు 3,744 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. గ్రామ, వార్డు సభల్లో వాటిని ప్రజల ముందు ఉంచి తొలగించనున్నారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు నాలుగు పథకాలకు సంబంధించి తా త్కాలిక లబ్ధిదారుల జాబితాల్లో 11,052 మంది వివ రాలను గ్రామ, వార్డు సభ ల్లో అధికారుల బృందం చదివి వినిపించింది. అయి తే అందులో 8,859 దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తికాగా.. 1,919 అభ్యంతరాలు అందాయి. కొత్తగా 3,073 దరఖాస్తులు వచ్చాయి.
అధికారుల పర్యవేక్షణలో..
గ్రామ, వార్డు సభలను జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగాయి. సభల నిర్వహణపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాకబు చేశారు. జిల్లా కేంద్రంలోని 7వ వార్డు సభలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొని పర్యవేక్షించారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం దుప్పట్‌పల్లిలో అర్హుల జాబితాలను పరిశీలించారు. మాగనూర్ మండలం చేగుంటలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో అడిషనల్ కలెక్టర్ బెనషాలం పర్యవేక్షించారు.
ప్రశాంతంగా సభలు : కలెక్టర్
జిల్లాలోని మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో సభలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రజాపాలన గ్రామసభలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి వీసీ నిర్వహించగా.. కలెక్టర్ మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అధికంగా దరఖాస్తులు అందించారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment