నేడు మక్తల్‌కువైద్యారోగ్యశాఖ మంత్రి
మక్తల్: మక్తల్ పట్టణంలో బుధవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు పట్టణ శివారులో రూ. 46 కోట్లతో చేపట్టనున్న 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా మక్తల్ మండలం కాచ్‌వార్‌లో జరిగే గ్రామసభకు మంత్రి హాజరవుతారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, డా.మల్లికార్జున్‌తో కలిసి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు, లేబర్ రూంను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేష్ కుమార్, డైరెక్టర్లు రంజిత్‌రెడ్డి, ఆర్‌ఐ రాములు, రవికుమార్, కట్ట సురేష్ పాల్గొన్నారు.
రోగులతో డబ్బులు తీసుకుంటే ఇంటికి పంపిస్తా!
● జిల్లా ఆస్పత్రి సిబ్బందికి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వార్నింగ్
నారాయణపేట: జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు మరోసారి తనకు తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తానంటూ స్థానిక ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాత్రివేళ చికిత్సల కోసం వస్తున్న రోగులకు సకాలంలో సేవలు అందించకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి, కమీషన్లు దండుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటివి తన దృష్టికి వస్తే సహించేది లేదన్నారు. రాత్రివేళలో పనిచేసే సిబ్బంది డాక్టర్లు లేరంటూ.. నిద్రపోతున్నారంటూ చెబుతూ రోగులను తిరిగి పంపిస్తున్నారని.. ఇకపై ఇది జరిగితే మిమ్మల్ని సైతం బయటికే పంపిస్తామని ఘాటుగా మందలించారు. ఆస్పత్రుల్లో పనిచేసే అందరి పనితీరు తనకు క్షుణ్ణంగా తెలుసని.. తాను కూడా డాక్టర్ అని.. తనతో నాటకాలు చేస్తే ఊరుకోనని అన్నారు. ఇక్కడికి వచ్చే రోగులు ధనవంతులు కాదని.. పేద ప్రజలే వస్తారని.. అందరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మిరెడ్డిపల్లి గ్రామవాసి దొబ్బలి సుజాతను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, కౌన్సిలర్ మహేష్, చంద్రకాంత్ ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి
మరికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని.. వివిధ కారణాలతో గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మరికల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది పనితీరుతో పాటు ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణులకు ప్రతినెలా క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అత్యవసరమైతే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. అనంతరం నెలవారీగా నమోదు అవుతున్న కాన్పుల వివరాలను తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ వెంట సిబ్బంది అరవింద్, బస్వరాజ్ ఉన్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
నారాయణపేట రూరల్: జిల్లాలోని కోస్గి, నారాయణపేట ఆర్టీసీ డిపోల పరిధిలో బుధవారం ఉదయం 11 గంటలకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికులు 73828 26293 నంబర్‌ను సంప్రదించి, తమ సమస్యలతో పాటు సూచనలు, సలహాలు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment