పథకాల అమలు నిరంతర ప్రక్రియ
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులందరికీ వర్తిస్తాయని.. ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మె ల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు అశోక్ నగర్‌లో ప్రజాపాలన వార్డు సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా అమలుచేసే నాలుగు పథకాల కోసం తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో పేపర్, డెస్క్‌వర్క్ అనంతరం లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు, గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితాల్లో పేరు లేని వారి నుంచి వార్డు, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల తర్వాత తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో ఎప్పు డైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత ప్రకారం కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మొబైల్ యాప్ ద్వారా సర్వే చేపట్టి, సొంత స్థలాలు ఉన్న వారితో పాటు స్థలాలు లేని దరఖాస్తుదారుల వివరాలను నమో దు చేయడం జరిగిందన్నారు. పూర్తి పరిశీలన అనంతరం వన్ బై వన్ సెలక్షన్ చేస్తారన్నారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వర్తిస్తుందని.. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని భూ భారతి రికార్డుల ప్రకారం ఇస్తారన్నారు. సభల్లో అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.
ఐదేళ్లలో అందరికీ న్యాయం..
ఐదేళ్లలో అందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి భరోసా ఇచ్చారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు. కొన్నేళ్లుగా కుటుంబాల సంఖ్య పెరిగినా.. గత ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలంటే సాధారణంగా ఎక్కువ జనం రారని.. కాని ఏడో వార్డు ప్రజలు సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా, ఏడో వార్డులో పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ సునీతను కలెక్టర్ ఆదేశించారు. అయితే వార్డు కౌన్సిలర్ సలీం కోరినట్టు పార్కులో మహిళలకు సందర్శన వేళలను ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. వార్డు కమ్యూనిటీ హాల్‌లో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఫర్నిచర్‌ను పరిశీలించారు. అనంతరం ఐదో వార్డులో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తనది ఐదో వార్డేనని.. మొన్నటి వరకు తాను పోటీ పరీక్షలు రాశానని.. వచ్చేనెల 4న మరో పరీక్ష ఉందన్నారు. ఆ పరీక్ష రాసిన తర్వాత ఇక్కడే ఉంటానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment