
చలిగా ఉన్న రాత్రివేళల్లో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకుండా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లయితే వారిని నైట్ షెల్టర్లకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. మకర సంక్రాంతి రోజున గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించే ఖిచ్డీ జాతరకు వచ్చే భక్తులకు కూడా నైట్ షెల్టర్‌లలో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
గోరఖ్‌నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం పౌర సదుపాయాలు, ఖిచ్డీ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే, వారిని గౌరవప్రదంగా సమీపంలోని నైట్ షెల్టర్‌కు తీసుకెళ్లాలని అన్నారు. అనాథలైన వారు చలిలో రోడ్డుపై వణుకుతున్నట్లు కనిపించకుండా చూడాలన్నారు. ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆరుబయట పడుకుంటే వారిని మానసిక వికలాంగుల ఆశ్రయాలకు తరలించి వైద్యం చేయించాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని నైట్ షెల్టర్లలో తగిన సంఖ్యలో పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనవారికి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31 నాటికి ఖిచ్డీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి భక్తులు రాక మొదలవుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ మంగ్లేష్ శ్రీవాస్తవ, జోన్ ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చూడండి: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి!
Comments
Please login to add a commentAdd a comment