మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.
నాసిక్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.
గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్‌లోని హోల్కర్ వంతెన కింద నుంచి 13,000 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేస్తున్నారు. నాసిక్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, నది ఒడ్డున ఉన్న గ్రామాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment