ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి | Israel-Palestine War News Today: India's Second Statement On Israel Gaza War A Balancing Act - Sakshi
Sakshi News home page

Israel-Hamas War: ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి

Published Sat, Oct 14 2023 9:36 AM | Last Updated on Sat, Oct 14 2023 11:30 AM

In India Second Statement On Israel Gaza War A Balancing Act - Sakshi

ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ రెండో ప్రకటన వ్యూహత్మకంగా ఉంది. విదేశాంగ శాఖ గురువారం వెలువరించి ప్రకటన ప్రధాని మోదీ మొదట ఇచ్చిన ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉన్నప్పటికీ తటస్థ వైఖరి కనిపిస్తోంది. మొదట ఇజ్రాయెల్‌ వైపే ఏకపక్షంగా ఉన్న భారత్.. పాలస్తీనాపై కూడా స్పందిస్తూ శాంతిని ఆకాంక్షించింది.

పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత గురించి భారతదేశానికి తెలుసని అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు. 

ప్రధాని మోదీ ప్రకటన
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపిన ఆరంభంలో ప్రధాని మోదీ ప్రకటన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ పాలస్తీనా పేరు కూడా ఎత్తకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు.  హమాస్ దాడులను ఉగ్రదాడులుగా పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 

అరబ్ దేశాలు నోరువిప్పడంతో
భారత విదేశాంగ శాఖ, ప్రధాని మోదీ ప్రకటనలలో ఉగ్రవాదంపై వ్యతిరేక వైఖరి ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పాలస్తీనా అంశాన్ని కూడా జోడించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పశ్చిమాసియాతో సంబంధాలు కోల్పోకుండా భారత్ వ్యూహంగా ముందుకు వెళుతోంది. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ-నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ వైపే ఏకపక్షంగా ఉన్నారు. గాజాలో జరుగుతున్న దాడులపై అరబ్ దేశాలు నోరువిప్పడంతో పరిస్థితి కాస్త మారింది. దీంతో వ్యూహాత్మకంగా భారత్ విదేశాంగ శాఖ పాలస్తీనా అంశంపై కూడా మాట్లాడింది.

అరబ్ దేశాలతో సంబంధాలు
అరబ్ దేశాలతో  వ్యూహాత్మక, ఆర్థిక,  సాంస్కృతిక ప్రయోజనాలను భారత్ కలిగి ఉంది. భారతదేశం చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇండియా పాలస్తీనాతో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చట్టబద్ధ గుర్తింపు కోసం 1974లో మద్దతు తెలిపిన ఏకైక అరబ్ దేశం కాని వాటిల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. 2016లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనాను కూడా సందర్శించారు. 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇండియాను సందర్శించారు. 

1977లోనూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వైఖరి కూడా పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. అక్రమంగా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఖాలీ చేస్తేనే పశ్చిమాసియా సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్‌పేయీ కూడా అన్నారు. 

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్‌ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్‌ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి.

ఇదీ చదవండి: ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్‌ సైన్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement